Congress | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : మాయదారి కాంగ్రెస్ మోసకారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. బీఆర్ఎస్ను రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొనలేని కాంగ్రెస్ పార్టీ దగాకోరు ఎత్తుగడలకు దిగుతున్నది. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని వికృత క్రీడకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో రాజకీయంగా నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ వదంతులను వ్యాప్తి చేయడమనే వంచనాశిల్పానికి దిగుతున్నది. అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ప్రజలను నమ్మించేందుకు ఎటువంటి కుయుక్తులు పన్నిందో కాంగ్రెస్ అంతకు వెయ్యిరెట్లు ఇప్పుడు కుతంత్రాలకు దిగుతున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ను బలహీనపర్చేందుకు, ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్ పన్నని పన్నాగం లేదు.. చేయని కుట్రలేదు. తాజాగా అది మాజీ మంత్రి, క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడు, సీనియర్ నేత అయిన హరీశ్‌రావుపై సోషల్ మీడియాలో కథనాలు వండివార్చింది. హరీశ్ అసంతృప్తితో ఉన్నట్టు, వేరే ఆలోచనలేవో చేస్తున్నట్టు కల్పిత కథనాలను ఈ-పేపర్ క్లిప్పుల రూపంలో ప్రజల్లోకి పంపింది.
దీనిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవల బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో అనూహ్యమైన ఆదరణ కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా ప్రజలు కేసీఆర్‌నే తలుచుకుంటూ.. మళ్లీ ఆయన వస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ సంపూర్ణ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలతోపాటు రాజకీయ విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఏదో జరుగుతున్నదనే అభూతకల్పనను వ్యాప్తిచేయడానికి కాంగ్రెస్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం కాంగ్రెస్ ఒక టీమ్‌నే ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఆ బృందం ముఖ్యనేతల కుటుంబసభ్యుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘బీఆర్ఎస్కు సంబంధించిన నకిలీ వార్తలను సృష్టించడమే ఈ టీమ్ పని. ఈ-పేపర్ క్లిప్ రూపంలో ఊరూపేరూ లేని వార్తలు తయారు చేసిన తర్వాత వాటికి సదరు పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకుంటారు. అనంతరం సోషల్ మీడియాలోకి వదులుతారు.
ఇదే అదనుగా కాంగ్రెస్ అనుబంధ సోషల్‌మీడియా ఖాతాలు వాటిని లెక్కకు మిక్కిలిగా ప్రజల్లోకి పంపిస్తుంటాయి. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను తగ్గించడం, విభేదాలున్నట్టుగా ప్రచారం చేయడం, జనంలో అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించడం, విషబీజాలు నాటి శ్రేణుల్లో చీలికలు తేవడం ప్రధాన ధ్యేయంగా ఈ టీమ్ పనిచేస్తున్నది’ అని కాంగ్రెస్ వ్యవహారాలను దగ్గరినుంచి చూస్తున్న ఓ పాత్రికేయ ప్రముఖుడు వివరించారు. ఫేక్‌న్యూస్ క్రియేట్ చేసే స్థాయికి కాంగ్రెస్ దిగజారడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభ తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ టీమ్ ఫేక్‌న్యూస్‌ను వదలడమే పనిగా పెట్టుకున్నది. కాంగ్రెస్ పాలనపై ప్రజావ్యతిరేకత పెరిగిపోతుండటం, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివెళ్లే సంకేతాలు అందుతుండటంతం కాంగ్రెస్ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్పై విషం చిమ్మడాన్ని పెంచుతూ పోయింది.
బీఆర్ఎస్పై అసత్య ప్రచారాల కోసం నకిలీ ఈ-పేపర్ల క్లిప్పులను అడ్డంపెట్టకొని వదంతులను ముమ్మరంగా వ్యాప్తి చేసింది. ‘బెట్టింగ్ మాఫియాతో కేటీఆర్‌కు లింకులు’ అని ఒకటి.. ‘ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో క్షుద్రపూజలు’ అని మరొకటి.. ‘వరంగల్ సభ రద్దు’ అంటూ ఇంకొకటి.. ఇట్లా ఫేక్‌న్యూస్ క్రియేట్ చేసి ప్రజల్లోకి వదిలారు. కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ రికార్డు బ్రేక్ కావడం, ఆ సభలోనే పహల్గాంలో ఉగ్రదాడిలో సువులు బాసిన వారి ఆత్మశాంతికి యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ నాయకత్వంలో నివాళులు అర్పించడంతో జీర్ణించుకోలేని సదరు టీమ్.. ‘2028లో బీఆర్ఎస్ కష్టమే’ అనే క్లిప్పింగుతోపాటు, హరీశ్‌రావుపైనా మరో తప్పుడు కథనం వదిలింది. ‘కొత్త పార్టీ పెట్టడమా? బీజేపీలో చేరడమా?’ అంటూ ఫేక్‌న్యూస్ క్రియేట్ చేసి వదలటంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణను గాడిలో పెట్టి, పూర్వవైభవం తేవాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో కేసీఆర్‌ను తిరిగి సీఎంను చేయడమే ధ్యేయంగా పార్టీ లీడర్, క్యాడర్ పనిచేస్తుంటే రాజమార్గంలో ఢీకొట్టే శక్తిలేక వదంతులను వ్యాప్తిచేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని బీఆర్ఎస్ ముఖ్యులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు త్వరలోనే బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.