హైదరాబాద్, డిసెంబర్ 19 ( నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా చెల్లించలేదని, మెస్‌చార్జీలు పెంచలేదని, ఫామ్ మెకనైజేషన్, డ్రిప్, స్ప్రింక్లర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయడానికి తాను సిద్ధమని, నిరూపించలేకపోతే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘ఈ అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమారకు చాలెంజ్ విసురుతున్నా. మేం మెస్‌చార్జీలు పెంచింది నిజం. డ్రిప్పు, ఫామ్ మెకనైజేషన్‌కు డబ్బులు ఇచ్చింది నిజం.. మేం ఇవ్వలేదని రుజువు చేస్తే ఇకడే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చి వెళ్లిపోతాను. మీరు అబద్ధం చెప్పినట్టయితే, మీరు కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయాలి’ అంటూ హరీశ్‌రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమాకు 2018-19లో రూ.883 కోట్లు, 2019-20లో రూ.950 కోట్లు, 2020-21లో రూ.1,456 కోట్లు, 2021-22లో రూ.1,166 కోట్లు, 2022-23లో రూ.1,139 కోట్లు చెల్లించినట్టు వివరించారు. శాసనసభలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ‘అబద్ధాలు చెప్పు.. అవే అబద్ధాలను పదేపదే చెప్పు.. మళ్లీ మళ్లీ చెప్పు.. దబాయించి చెప్పు.. బెదిరించి చెప్పు.. కానీ.. అబద్ధాలు మాత్రమే చెప్పు.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం మాత్రం చెప్పకు’ అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
క్యాబినెట్ అంటేనే సమష్టి నిర్ణయమని, ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ఓ మంత్రి మరో మంత్రిని ప్రశ్నలు అడగడం ఏమిటని? ఇదెక్కడి సంస్కృతి అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శాసనసభలో మండిపడ్డారు. సమావేశాల తీరుపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మూసీతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. సభ తీరుపై హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు.