సిద్దిపేట, జూన్ 28: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేవ ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రగల్భాలు పలుకడం కాదని, దమ్ముంటే వారితో రాజీనామాలు చేయించి ఎన్నికల బరిలోకి రావాలని, జనం ఎవరికి ఉప్పుపాతర వేస్తారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నల్లగొండలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. సిద్దిపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి, రైతుబంధు గురించి మాట్లడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు.
నాడు తెలంగాణ కోసం తాము మంత్రి పదవులకు గడ్డిపోచల్లా రాజీనామాలు చేశామని, తన మీద 300 కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ఆనాడు రాజీనామా చేయాలని కోరితే వెన్నుచూపి పారిపోయి, ఆంధ్రాబాబుల అడుగులకు మడుగులొత్తిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టి, సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్‌రెడ్డికి లాఠీదెబ్బలు తిని 300 కేసులు ఎదురొన్న మా త్యాగాల గురించి మాట్లాడే నైతికత లేదని స్పష్టంచేశారు. ‘కర్ణాటకలో ముగ్గురు సీఎంలతో జరిపిన మీటింగ్ ఏమిటి? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హకులు కాపాడారా?’ అని తాను సూటిగా ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక రేవంత్‌రెడ్డి నల్లగొండ వెళ్లి పరుష పదజాలంతో తిడుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆరడుగులు, తాటిచెట్టంత పెరిగానని నా ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు.
నేను పొట్టిగా ఉంటే ఏంది? జగదీశ్‌రెడ్డి పొట్టిగా ఉంటే ఏంది? ప్రజలకు సేవ చేయడంలో, అభివృద్ధి చేయడంలో మేమెప్పుడూ పొడుగుగానే ఉన్నాం’ అని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి మనసు, ఆలోచన, బుద్ధి పొట్టిది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి, తన ఎత్తు గురించి, భౌతికరూపం గురించి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తుపాకీ పట్టుకొని, ఉద్యమకారులపైకి వెళ్లిన తుపాకీ రాముడివి నువ్వు.. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అన్నది నువ్వు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం యాదిరెడ్డి ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ ఇం టి ముందు ఉరివేసుకుని చనిపోతే, ఆ మృతదేహాన్ని తీసుకొనిరావడానికి కేటీఆర్, తాను, ఈటల రాజేందర్ ఢిల్లీకి పోయి అక్రమ కేసులు ఎదురొన్నామని చెప్పారు. అప్పుడు రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఉద్యమం చేయని బిడ్డ లేడని, , ప్రతి ఇల్లూ ఒక ఉద్యమ కేంద్రమేనని స్పష్టంచేశారు.
‘నువ్వు ఎకడికి పోయినా బీఆర్ఎస్, కేసీఆర్‌ను తిట్టకుండా ఉండలేకపోతున్నావంటే, నీకు కుర్చీ కదులుతున్నదన్న భయం పట్టుకున్నదని, నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నావని ప్రజలకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ అంటేనే రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను ఉప్పు పాతర వేశామని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదని, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో కనీసం ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేని పార్ట్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అధికారం నెత్తికెకి, అహంకారంతో కండ్లు మూసుకుపోయి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికే ప్రజలు త్వరలో ఉప్పుపాతర వేస్తారని హెచ్చరించారు.
‘2028, 2034 దాకా మేమే అధికారంలో ఉంటామని అంటున్నావు కదా.. నీ పాలన మీద నీకు అంత నమ్మకం ఉంటే, అసెంబ్లీని రద్దు చేయి. మేమూ మా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూసుకుందాం’ అని సవాల్ విసిరిరారు. కుర్చీ కదులుతున్నదన్న భయంతోనే నిద్రలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను కలవరిస్తూ రోజూ బీఆర్ఎస్ నామస్మరణ చేసున్నావని మండిపడ్డారు. సింగరేణి టెండర్ల గురించి నల్లగొండ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారని, అసలు టెండరే కాలేదని బుకాయిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇ చ్చి, నీ బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్స్కు టెండర్ కట్టబెట్టింది నిజం కాదా? దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. రుజువు చేస్తానని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక ప్రతిపక్షాలను తిడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2,500, సూటీ, తులం బంగారం, రూ.4,000 పెన్షన్, 2 లక్షల ఉద్యోగాలు, రూ.15,000 రైతుభరోసా అమలు చేయడం చేతగాక బీఆర్ఎస్ను తిడుతున్నాడని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు మాట్లాడటమే రేవంత్‌రెడ్డి నైజమని, రైతుభరోసా వేయకుండానే రైతుల కండ్లల్లో ఆనందం చూస్తున్నానని నల్లగొండలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతుభరోసా ఇస్తానన్న దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు.
ఒక సీజన్ రైతుబంధు ఎగ్గొట్టి, మరో రెండు సీజన్లలో సగం సగం ఇచ్చి.. రాష్ట్ర రైతులకు ఏకంగా రూ.29 వేల కోట్ల రైతుబంధును ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయనందుకు, రైతుబీమా ఎగ్గొట్టినందుకు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనందుకు రాష్ట్ర రైతాంగానికి రేవంత్‌రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో కొనుగోలు కేంద్రాలు, రోడ్లు, అభివృద్ధి గురించి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆనాడు అసెంబ్లీలోనే తనను, బీఆర్ఎస్ ప్రభుతాన్ని మెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆయన అడిగిన వెంటనే నకిరేకల్‌లో నిమ్మకాయల మారెట్, నల్లగొండలో బత్తాయి మారెట్ ఏర్పాటుచేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఒక ఎకరానికైనా నీళ్లిచ్చిందా? అని ప్రశ్నించారు.