Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నదని అన్నారు. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యిందని ఎద్దేవా చేశారు.
విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు. ఆ డాక్యుమెంట్ కు శాంటిటీ లేదని అన్నారు. అక్షరాలు, అంకెలు, రంగు రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అది అని అన్నారు. రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్ అని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టారని.. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరు అన్నారని.. మంత్రులు పోయి ఒక్కో ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించారని గుర్తుచేశారు. కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదు, 5వేల మంది విదేశీ రిప్రెజంటేటివ్స్ రాలేదు. ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప అని అన్నారు. చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి ఉందని విమర్శించారు.
గ్లోబల్ సమ్మిట్‌లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారని అన్నారు. ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కాదు అది లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది అని విమర్శించారు. ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని.. అందమైన కట్టుకథ అల్లినవు రేవంత్ రెడ్డి? బయో స్కోప్ సినిమా చూపించావు.. భూముల స్కాం అయిపోయింది.. పవర్ స్కాం అయిపోయింది.. లిక్కర్ స్కాం అయిపోయింది.. ఇప్పుడు ఇగ రియల్ ఎస్టేట్ స్కాం మొదలు పెట్టిండు అని మండిపడ్డారు. రేవంతు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే కానీ, పెట్టుబడుల కోసం కాదు అని అందరికీ అర్థం అయ్యిందని అన్నారు.
ఫార్మా సిటీ పక్క భూములు ముందుగానే మీ బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నాడని అన్నారు. ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టీ, ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశావని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాం కు తెరతీశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రెండేళ్లుగా పెట్టుబడుల పేరిట కట్టు కథలు తప్ప చేసింది ఏం లేదని అన్నారు.
2024 జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దావోస్ సమావేశానికి వెళ్లారని తెలిపారు. 40,232 కోట్ల పెట్టుబడులు సాధించినం అని, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తయని చెప్పారని గుర్తుచేశారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని నిలదీశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ -2024 నిర్వహించిందని గుర్తుచేశారు. 100 దేశాల కంపెనీలు పాల్గొన్నరూ, 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నం అని డబ్బా కొట్టారని తెలిపారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు. జనవరి 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావాస్ లో జరిగిన సమావేశం సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారని తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నం అని అక్కడ ఎంతో తిరిగినట్లు, ఎంతో కష్ట పడ్డట్లు సూటు బూటు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టించుకున్నారని పేర్కొన్నారు. అంతా అయిపోయినంక 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల (1.78లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నదని ఘనంగా ప్రకటించారని.. ఈ ఒప్పందాల ద్వారా 49,550 ఉద్యోగాలు వస్తయి అన్నరని తెలిపారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని ప్రశ్నించారు.
పెట్టుబడులు తెస్తం అని రెండు సార్లు దావోస్ పోయిండు. అమెరికా పోయిండు. సౌత్ కొరియా పోయిండు. ఆస్ట్రేలియా పోయిండు, సింగపూర్ పోయిండు, జపాన్ పోయిండు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని హరీశ్‌రావు నిలదీశారు. నిన్న, మొన్న రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ లో ఏకంగా 5లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాలు విసిరారు. దమ్ముంటే స్వీకరించాలని అన్నారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దావోస్ పెట్టుబడులు, అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ కంపెనీలు ఎక్కడకు పోయాయి, పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.