కాంగ్రెస్ పాలనలో రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్టు, ఫీజు రీయింబర్స్మెంట్. ఓవర్సీస్ స్కాలర్షిప్ అన్నీ బందైనయి. సెక్యులర్ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి సరారు ఒక మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు .
– మైనార్టీల సమావేశంలో హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నరు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పనికిరాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెకలతో, తప్పుడు మాటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదు’ అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కృష్ణాజలాలు, మేడిగడ్డ బరాజ్ తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ నీటి హకులను తాకట్టు పెడుతున్న రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని ధ్వజమెత్తారు. చర్చకు పిలిచే దమ్ములేకనే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రివిలేజ్‌కు భంగం కలిగించిందుకు ఉభయసభల్లో సభాహక్కుల తీర్మానం ఇస్తామని హెచ్చరించారు.
‘ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారుతారా? మీ అబద్ధాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. మీరు చెప్పిన ప్రతీమాట పచ్చిఅబద్ధమే అని అసెంబ్లీ లోపల, బయట అనేకసార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించాను. అయినా కుకతోక వంకర అన్నట్టు.. చెప్పిన అబద్ధాలనే మళ్లీమళ్లీ చెప్తూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడటం సిగ్గుచేటు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగురంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. పదవుల కోసం పెదవు లు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అన్నది నాడు, నేడు ఉన్న మంత్రులు. ఇప్పుడు మళ్లీ అదేరీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపులో తోడ్పా టు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు, ఇ ప్పుడూ.. ఎప్పుడూ మీది ద్రోహ చరిత్రనే రేవంత్‌రెడ్డి’ అంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పకనబెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో 50 ల క్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందనేది పచ్చి అబద్ధం. అదే నిజమైతే రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు’ అని సవాల్ విసిరారు. ‘మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడింది. తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా? ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చవాన్ నాటి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాయడం నిజం కాదా? చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యం తో తమ్మడిహట్టి ప్రాజెక్టుకు సమస్య రావడం వాస్తవం కాదా? అయినా ఏ సమస్య లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పకనబెట్టిందని చెప్పడం పచ్చి అబద్దం’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా 2007లో మొదలుపెట్టిన ప్రాజెక్టును 2014 వరకు ఎందుకు పూర్తిచేయలేదని, కనీసం అనుమతులు కూడా ఎందుకు సాధించలేదని నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణ వ్యయాన్ని ఏ కమీషన్లు దండుకునేందుకు రూ.17వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు పెంచారని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యిందని, అయినా మేడిగడ్డను పడావుపెట్టి నీళ్లను కిందకు వదిలి చోద్యం చూస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మేడిగడ్డను రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా, ఎల్అండ్టీ రిపేర్ చేయడానికి సిద్ధపడినా ఎందుకు అనుమతించడంలేదని నిలదీశారు. ‘మేడిగడ్డ బరాజ్ మీది నుంచి వాహనాలు అనుమతించాలని ఎన్డీఎస్ఏ నీకు చెప్పిందా? కూలిందని చెప్పుకుంటూనే ఎందుకు రాకపోకలు అనుమతిస్తున్నారు? ఏ నిపుణుల కమిటీ చెప్పంది రేవంత్‌రెడ్డి?’ అంటూ నిలదీశారు. అసెంబ్లీకి నిపుణులను పిలవడం కాదు, మొదట నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు నిపుణులను పిలుచుకొని ముందు వారితో మాట్లాడాలని చురకలంటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్లో అధికారికంగా నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన వారిని మాత్రమే ఆహ్వానించి ఇతర పార్టీల నేతలను విస్మరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇరిగేషన్‌పై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి ప్రజాభవన్‌లో సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదని నిలదీశారు. ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్‌కు భంగం కల్పించడమేనని, దీనిపై శాసనసభ స్పీకర్‌కు, శాసన మండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందని హరీశ్‌రావు వెల్లడించారు.
జూరాల జలాశయం నికర నిల్వ సామర్థ్యం ఏడు టీఎంసీలు మాత్రమేనని, దానిమీద ఇప్పటికే బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పలు పట్టణాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయని హరీశ్‌రావు వివరించారు. దానికి అదనంగా రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి ఆ మాత్రం తెల్వదా? అని విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడకముందే ఒప్పుకొని మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పుకు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నది. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అబద్ధాలను అందంగా చెప్పే రేవంత్‌రెడ్డీ.. ఎవర్ని కొరడా దెబ్బలు కొట్టాలె? ద్రోహం చేసింది ఎవరు.. కొరడా దెబ్బలు తినాల్సింది ఎవరు?’ అంటూ నిప్పులు చెరిగారు.