Harish Rao | ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల విషయంలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వాన్ని గ్రామసభల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని అన్నారు. గ్రామాల్లో వీటిపై గ్రామ సభలు నిర్వహిస్తున్నారని.. ఈ గ్రామ సభల్లో పార్టీ శ్రేణులు పాల్గొని నిజమైన, అర్హులైన పేదలకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.
ఆత్మీయ భరోసా పేరు మీద రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలుచేయాలని అడగాలని సూచించారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో 75,000 మందికే వర్తిస్తుందని.. మిగతా లక్షా 25 వేల మంది కూలీల సంగతి ఏందని నిలదీశారు. వీరంతా కూలి పనికి వెళ్లే నిరుపేదలు అని తెలిపారు.
ఎస్సీ ఎస్టీ, బీసీ రైతులు ఎక్కువగా ఉంటారని.. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని అన్నారు. ఎకరంలోపు భూమి ఉన్న రైతుకు కూడా ఈ పథకం వర్తించాలని గ్రామసభలో అడగాలన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీ కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలిగా గుర్తింపు అనే నిబంధన కూడా సరైనది కాదని అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలతోనూ, ఇతర సమస్యలతోనూ 60 ఏళ్ళు నిండిన రైతుకు, పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నదని అన్నారు. ఈజీఎస్ పథకంలో కూలీలు 60 సంవత్సరాల వయసు దాటితే కార్డు కోల్పోతారని తెలిపారు. కాబట్టి ఈ పథకంలో ఈజీఎస్ నిబంధన విధించకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతు భరోసా 10 వేలను 15 వేలు చేస్తామని ఎన్నికల్లో ప్రగల్బాలు పలికి, కోతలు ఎగవేతలతో 12 వేలు ఇస్తున్నారని విమర్శించారు. ఎగ్గొట్టిన వానాకాలం 6 వేల సంగతి ఏందీ అని ప్రశ్నించారు. వానాకాలం పైసలు ఇవ్వాలని గ్రామ సభలో తీర్మానం చేపించాలని సూచించారు. రైతు భరోసాలో ఎగవేతలు చేస్తున్నారని.. న్యాయంగా ఉండే వారికి రైతు భరోసా వచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు సూచించారు. అర్హులైన రైతులందరిని గురించేలా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంటి స్థలం ఉండి కిరాయి ఉన్నవారికి, గుడిసెల్లో ఉండే వారికి, కవర్లు కప్పి ఉన్న ఇళ్లకు, అనాథలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, హిజ్రాలకు స్థలం ఉంటే ఇది వర్తిస్తుందని.. ఇలాంటి వారిని గుర్తించి అర్హులైన వారికి అందేలా చూడాలని పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు సూచించారు.
రేషన్ కార్డు విషయంలో ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో కుల గణన సంబంధం పెట్టారని హరీశ్‌రావు అన్నారు. మరి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి సంగతి, కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి సంగతి ఏంటి అని గ్రామ సభల్లో నిలదీయాలని సూచించారు. గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల వైపు నిలబడాలన్నారు. నిజమైన, అర్హులైన పేదలందరికి న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని సూచించారు.