హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బారులు తీరుతున్నారని విరుచుకుపడ్డారు. ఆధార్, పాసుబుక్‌లు చేతబట్టుకొని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల ఎదుట పడిగాపులు కాస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ‘పండుగ లేదు.. పబ్బంలేదు.. ఎండలేదు..వాన లేదు.. రాత్రింబవళ్లు క్యూలలో నిలబడుతున్నరు. తిండీతిప్పలు లేకపోవడంతో అలసి సొలసి పడిపోతున్నరు. నిలబడే ఓపిక లేక లైన్లో చెప్పులు, రాళ్లు, అట్టపెట్టెలు, ఖాళీ సీసాలు పెట్టి నిరీక్షిస్తున్నరు’ అంటూ విచారం వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి యూరియా తెప్పించడం, సరఫరాపై ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతోనే దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
‘పత్తి పూత దశలో ఉన్నది.. వరి పొట్ట దశలో ఉన్నది. ఈ సమయంలో యూరియా వేయకుంటే దిగుబడి రాదు. పెట్టుబడి దండుగ’ అంటూ ఆవేదనతో రైతులు చెప్తున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు నెలలుగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా పాలకులు మొద్దునిద్ర నటించడం దారుణమని దుయ్యబట్టారు. 22 నెలల్లో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడిరోడ్డు మీదకు ఈడ్చిన ఘనత కాంగ్రెస్ పాలనకే దక్కిందని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ దిక్కుమాలిన పాలన రాష్ట్ర రైతాంగానికి పెనుశాపంగా మారిందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏనాడు యూరియా కోసం ఇంత తిప్పలుపడ్డ పరిస్థితులు చూడలేదని చెప్పారు.
అసెంబ్లీలో బురద రాజకీయం
అన్నదాతలు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై చర్చిద్దామంటే అధికార పార్టీ పారిపోయిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తమకు వరదలు, ఎరువుల సమస్యల కంటే బురద రాజకీయాలే ముఖ్యమని తప్పించుకున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలను గాలికొదిలి కక్ష సాధింపే లక్ష్యంగా సభను నిర్వహించారని ఆక్షేపించారు. ఆదరాబాదరాగా ఆదివారం సభ నిర్వహించి అర్ధాంతరంగా, అసంపూర్తిగా ముగించారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేదు. దమ్మూ ధైర్యం అంతకంటే లేదని తూర్పారబట్టారు. నాటి కాంగ్రెస్ ‘జై కిసాన్’ నినాదమిస్తే నేటి రేవంత్ కాంగ్రెస్ ‘నై కిసాన్’ నినాదమిస్తున్నదని దుయ్యబట్టారు.
పాలన మారగానే పాలసీలు మారతాయా?
కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్నదాతలు ఏనాడూ యూరియా కోసం వెతలు పడలేదని హరీశ్‌రావు గుర్తుచేశారు. పాలనా దక్షత, రైతులపై ప్రేమ, ముందుచూపుతో వ్యవహరించడంతోనే రాష్ట్ర రైతాంగం నిశ్చింతగా ఉండేదని గుర్తుచేశారు. కానీ పాలన మారగానే పాలసీలు సైతం మారిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మొన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన రైతులు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఎక్కడికక్కడ హైవేలెక్కి ధర్నాలు చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి, ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం’ అని దెప్పిపొడిచారు.
16 మంది ఎంపీలుండీ ఏం లాభం?
రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలను గెలిపిస్తే ఒరిగిందేమీలేదని హరీశ్‌రావు దు య్యబట్టారు. యూరియా తేవడంలోనూ విఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నెపంనెట్టుకోవడం తప్ప రైతులకు చేసిందేమీలేదని విమర్శించారు. కేంద్రం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంతో ఆయిల్‌పాం రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తేయడం శోచనీయమని అన్నారు. రైతులను ఇన్ని సమస్యలు చుట్టుముడుతుంటే 16 మంది ఎంపీలుండి ఏం లాభమని ప్రశ్నించారు. అబద్ధాలాడటంలో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. చేతల్లో మాత్రం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అని విమర్శించారు. రెండు పార్టీల వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారిందని వాపోయారు. కేంద్రం పామాయిల్‌పై సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలు కట్టిపెట్టి యూరియా సంక్షోభంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. లేదంటే యూరియా కోసం రైతుల తరఫున పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు.