రేవంత్‌రెడ్డీ.. నువ్వు పోలీసుల వెనుక దాకొని పిరికిపందలా నోటీస్ పంపడం కాదు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో. నువ్వు
ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా హరీశ్‌రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటది. రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపించి, అంతా కక్కించి, జైలు ఊచలు లెక్కపెట్టిస్తం. -హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా హెచ్చరించారు. ‘నీకు దమ్మూధైర్యముంటే, నిజాయితీపరుడివే అయితే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ‘మొత్తం రింగుకు ‘కింగ్ పిన్’ నీ బావమరిది. నీ బావమరిదే మొదటి దోషి. అన్ని ఆధారాలూ ఇచ్చేందుకు మేం సిద్ధం’ అని తేల్చిచెప్పారు. సిట్ విచారణపై లీకులు కూడా ఇస్తారని, దమ్ముంటే మొత్తం రికార్డు చేసిన వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వెనుక దాకొని పిరికిపందలా నోటీసు పంపడం కాదని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా హరీశ్‌రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటదని స్పష్టంచేశారు.
రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపించి, అంతా కక్కించి, జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు. మంగళవారం సిట్ విచారణ ముగిసిన అనంతరం నేరుగా తెలంగాణభవన్‌కు వచ్చిన హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసు అంతా ఒక ట్రాష్ అని, నిరాధార ఆరోపణలు, సొల్లు పురాణం తప్ప మరేమీ లేదని చెప్పారు. విచారణ సందర్భంగా తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఆధారాలు లేకుండా అధికారులు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు ఓ గంటసేపు విచారణ చేసి.. పై నుంచి ఫోన్లు రాగానే బయటకు వెళ్లి మాట్లాడారంటూ విచారణ తీరును వివరించారు. మళ్లీ విచారణ మొదలుపెట్టిన అర్ధగంటకే మళ్లీ ఏదో ఫోన్ అంటూ ఇతర అధికారులు సైగలు చేయగానే బయటకు వెళ్లి మాట్లాడి వచ్చారని తెలిపారు. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి, లేక సీపీ సజ్జనార్ ఫోన్లు చేసి ఉండొచ్చని, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. సిట్ విచారణ సందర్భంగా తనకు నైతికంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

‘కింగ్ పిన్’ రేవంత్ బావమరిదే
మంత్రుల వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ ‘అటెన్షన్ డైవర్షన్’ పాలిటిక్స్ చేస్తున్నదని హరీశ్ విమర్శించారు. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ పేరిట జరిగిన కుంభకోణాన్ని తాను బట్టబయలు చేయడంతోనే తనపై సిట్ విచారణ చేపట్టారని మండిపడ్డారు. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు రేవంత్‌రెడ్డి బావమరిదే అని తేల్చిచెప్పారు. సింగరేణి కుంభకోణానికి సంబంధించి మొత్తం రింగుకు ‘కింగ్ పిన్’ రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్రెడ్డేనని, దమ్ముంటే ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌చేశారు.
సీఎం, మంత్రుల వాటాల లొల్లి బట్టబయలు
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ రోడ్డున పడిందని, ఆ అంశాన్ని డైవర్షన్ చేసేందుకు సిట్ పేరిట నోటీసులు పంపారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ నోటీసులు కూ డా తన ప్రజా పోరాటానికి దకిన గౌరవంగానే భావిస్తానని చెప్పారు. ఓ ప్రైవేట్ కేసులో కోట్లు ఖర్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టు, హైకో ర్టు వాటిని కొట్టివేసింది’ అని చెప్పారు. మళ్లీ ఇప్పుడు సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాల నిలయం
కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని హరీశ్ విమర్శించారు. ‘మీ బావమరిది అవినీతి బాగోతాన్ని బయట పెడితే నాకు సిట్ నోటీసులు ఇచ్చినవు. దండుపాళ్యం ముఠా తరహాలో దోపిడీ చేస్తుంటే కేటీఆర్, నేను, మా నాయకులు అడ్డు పడుతున్నమని ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నవు రేవంత్‌రెడ్డీ’ అని ఫైరయ్యారు.

ప్రజాకోర్టులో సమాధానం చెప్పాలి
సిట్ నోటీసులకు సమాధానం చెప్పడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని, బాజాప్తా వచ్చి అన్ని నిజాలు చెప్తానని హరీశ్ తెలిపారు. ‘సిట్టు, లట్టు, పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా వేసుకో.. న్యాయస్థానాలను గౌరవించే వ్యక్తిగా నేను ఏ విచారణకైనా వస్తా. కాసో రేవంత్.. నేను కుంభకోణాలు కుండబద్దలు కొట్టినట్టు బయట పెడుతూనే ఉంటా. ఇంకా గట్టిగా కొట్లాడుతం’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తిరుగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ‘లీకులు ఇవ్వడం కాదు. రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే ఈరోజు జరిగిన విచారణ మొత్తం రికార్డు బయట పెట్టు. అంతేగానీ చేతగాని వాడిలా లీకులిచ్చి చిల్లర రాజకీయాలు చేయకు’ అని హితవుపలికారు. ‘లీకులు కాదు రేవంత్‌రెడ్డీ.. రైతులకు రైతుబంధు ఇవ్వు’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ఈ నోటీసులు మిమ్మల్ని భయపెట్టలేవు.
మీ పతనానికి దోహదం చేస్తయ్. నోటీసులతో మీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నవు. రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నీ బావమరిది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపిస్తం. అంతా కకిస్తం. జైలు ఊచలు లెక్కపెట్టిస్తం’ అని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ రవిచంద్ర, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.అధికారులు ఓ గంట సేపు విచారణ చేసి.. పై నుంచి ఫోన్లు రాగానే బయటకు వెళ్లి మాట్లాడిండ్రు. మళ్లీ విచారణ మొదలుపెట్టిన అర్ధగంటకే ఏదో ఫోన్ అంటూ ఇతర అధికారులు సైగలు చేయగానే బయటకు వెళ్లి మాట్లాడి వచ్చిండ్రు. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసిండో? లేక సీపీ సజ్జనార్ ఫోన్ చేసిండో? మరి!
-హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఎలాంటి తప్పు చేయకపోతే సింగరేణి బొగ్గు కుంభకోణంపై హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మొత్తం అవినీతికి సంబంధించి ఆధారాలను సిట్టింగ్ జడ్జికి అందజేసేందుకు మేం సిద్ధంగా ఉన్నం. సింగరేణి
కుంభకోణానికి సంబంధించి మొత్తం రింగుకు ‘కింగ్ పిన్’ రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్రెడ్డే.
-హరీశ్‌రావు
చట్టం మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎన్ని సార్లు పిలిచినా విచారణకు హాజరవుతం. అక్రమ కేసులు, అరెస్టులు, నోటీసులు మాకేం కొత్త కాదు. సిట్ నోటీసులకు పారిపోయేటోళ్లం కాదు. మీ అక్రమాల బాగోతం బయటపడింది. న్యాయం గెలిచింది.. ధర్మం నిలిచింది.
-హరీశ్‌రావు