సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 11 : రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట అమ్ముకొని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును శనివారం హరీశ్‌రావు సందర్శించారు. పొద్దుతిరుగుడు, మక్కజొన్న పంటను నాలుగు రోజులుగా కొనుగోలు చేయడం లేదని ఈ సందర్భంగా రైతులు హరీశ్‌రావు ఎదుట వాపోయారు. వెంటనే హరీశ్‌రావు అధికారులకు ఫోన్‌చేసి దిగుబడులు కొనుగోలు చేయకపోవడంపై మండిపడ్డారు. వెంటనే మార్కెట్ యార్డును సందర్శించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంట కొనుగోళ్లు చేపట్టకుండా సర్కార్ రైతుల పట్ల వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. నారాయణఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు మారెట్ యార్డులను సందర్శించాలని సూచించారు. పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దికులేదని అన్నారు. వడగండ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి రైతుబంధు ఇవ్వాలని కోరారు.
బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీలను దగా చేసిందని మండిపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.