Harish Rao | నీకు ఫుట్‌బాల్ ఒకటే వచ్చు.. నాకు క్రికెట్ మాత్రమే తెలుసు. గోల్ కొట్టేది మేమే.. వికెట్ తీసేది మేమే..కప్ గెలిచేదీ మేమే? ఈ లోపు హిట్‌వికెట్ కాకుండా చూసుకో. నీ మంత్రులే నిన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు. కేసీఆర్ పెట్టిన భారీ అంబేదర్ విగ్రహానికి రేవంత్ దండం పెట్టడు కానీ, బాపూ విగ్రహం పెడతాడట. కట్టడం కాదు.. కూల్చుడే రేవంత్ పాలసీ.
– హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. నన్ను డీల్ చేసుడు తర్వాత.. ముందు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకో’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలికారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని చెప్తున్న రేవంత్.. వచ్చే ఎన్నికల్లోపు సెల్ఫ్‌గోల్ కాకుండా, హిట్ వికెట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ముందు సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా చూసుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్ తీసేది బీఆర్ఎస్సేనని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఆరు మంత్రి పదవులను నింపుకొనేందుకే రేవంత్‌కు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వడం లేదని ఎద్దేవాచేశారు. మూసీపై బీఆర్ఎస్ విజన్ క్లియర్‌గా ఉన్నదని చెప్పారు. ‘సుందరీకరణ పేరుతో మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కట్టవద్దు.. పేదలను కొట్టకు.. పెద్దలకు పెట్టకు’ అని సూచించారు.
మూసీ పునర్జీవానికి తాము వ్యతిరేకం కాదని, సుందరీకరణ పేరుతో కూల్చివేతలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వ్యతిరేకమని స్పష్టంచేశారు. ‘హైదరాబాద్ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం.. రేపు రమ్మంటావా? ఎల్లుండి రమ్మంటావా?’ అని ప్రశ్నించారు. తాను, కేటీఆర్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తామని సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు 11 నెలల కాలంలోనే అన్నివర్గాల ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కొంటున్నదని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ అని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం పక్కా అని చెప్పారు.
రుణమాఫీ, రైతుబంధు, ధాన్యం, పత్తి కొనుగోళ్లపై రైతులు, 29 జీవోపై నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానంపై పోలీసులు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు ఇలా అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రేవంత్ నోరు తెరిస్తే అన్నీ పచ్చి అబద్ధాలని, ఆయన మాట్లాడుతుంటే పిల్లలు ఎకడ చెడిపోతారోనన్న భయంతో తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. సొంత తండ్రి పిల్లలను నమ్మనట్టుగా తనకు రక్షణ కల్పిస్తున్న స్పెషల్ పోలీసులను రేవంత్‌రెడ్డి నమ్మడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏక్ పోలీస్ విధానం అమలు అడిగేతే 39 మందిని సస్పెండ్ చేయడం, 10 మంది డిస్మిస్ చేయడం ఏమిటని నిలదీశారు.
సీఎం రేవంత్‌రెడ్డివి అన్నీ అబద్ధాలేనని, మాట మీద నిలబడని వ్యక్తి అని హరీశ్ విమర్శించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగంగా చెప్పిన రేవంత్ మళ్లీ వచ్చి మలాజిగిరిలో ఎంపీగా పోటీ చేశారని గుర్తుచేశారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షలలోపు రైతులందరికీ రుణమాఫీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చి తప్పాడని చెప్పారు. 31 రకాల సాకులతో రుణమాఫీని ఎగ్గొట్టారని, దాన్ని పూర్తి రుణమాఫీ కాదు.. పాక్షిక రుణమాఫీ అంటారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ విషయంలో రైతులను రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో నిలుస్తారని చెప్పారు. ఏడాది పూర్తి కావస్తున్నా, పూర్తి క్యాబినెట్ వేయలేక పోయారని, రాష్ట్రాన్ని సమస్యల కుప్పగా మర్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఆరు మంత్రి పదవులు కూడా నింపుకోలేదని, విద్య, హోం శాఖలకు మంత్రులే లేరని మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ చేయాల్సిన పనులు పకన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? రాష్ట్రం రాకుంటే తెలంగాణకు రేవంత్ ముఖ్యమంత్రి అవుతుండెనా? అని హరీశ్‌రావు నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ తెలంగాణ రక్షకుడు. మళ్లీ సీఎం కేసీఆరేనని ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. కుర్చీని ఎప్పుడు ఎవరు గుంజుకుపోతారోనన్న భయంతో రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక మంత్రి గవర్నర్‌ను కలిశారు. ఇంకో మంత్రి హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగారు. మరోమంత్రి ఏమో ఢిల్లీ వెళ్లారు. కొంతమంది మేము సీఎం అవుతామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నరు. నీ మంత్రులు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో. సీనియర్లు కుర్చీని గుంజుకోకుండా చూసుకో’ అని రేవంత్‌కు హరీశ్‌రావు సూచించారు.
మూసీపై అభ్యంతరాలు, విజన్ ఉంటే చెప్పండని సీఎం అంటున్నారని, మూసీ విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ తన విజన్‌ను అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కరించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో చాలా ఇండ్లు కూల్చారు.. కానీ, ఒక ఇల్లు కూడా కట్టలేదు. మూసీ పునరుద్ధరణ చేపట్టిందే బీఆర్ఎస్. వ్యతిరేకం ఎలా అవుతాం? బఫర్‌లో ఉన్న పేదల ఇండ్లు కూలగొట్టవద్దని చెప్తున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని హరీశ్ విమర్శించారు.
మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ విజన్ క్లియర్‌గా ఉన్నదని హరీశ్‌రావు చెప్పారు. మూసీ ప్రాజెక్టు అభివృద్ధికి అనుకూలమని, సుందరీకరణ పేరిట కమీషన్ల కోసం పేదల ఇండ్లు కులగొడతామంటే అందుకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పారు. మల్లయ్య ఇల్లు కూల్చివేసి మాల్ కడుతామంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు.
కొండపోచమ్మసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, గండిపేటకు గోదావరి నీళ్లు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాస్కోప్తో కేసీఆర్ డీపీఆర్ చేయించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న కొండపోచమ్మసాగర్ కాకుండా దూరంగా మల్లన్నసాగర్ నుంచి ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు. రూ.1100 కోట్లతో అయ్యే పనిని రూ.7,000 కోట్లకు కమీషన్ల కోసమే పెంచారా? అని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం తాము ఇచ్చిన నష్టపరిహారం కంటే రెట్టింపును మూసీ బాధితులకు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆసియాలోనే అద్భుతమైన ఆర్అండ్ ఆర్ కాలనీ నిర్మించామని చెప్పారు. తాము 250 గజాల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చామని, 18 ఏండ్లు నిండినవారికి రూ.5 లక్షలు ఇచ్చామని, ఇండ్లు కట్టించామని, బ్రహ్మాండంగా వసతులు కల్పించామని తెలిపారు. మల్లన్నసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీ రాజమౌళి సినిమాను తలపించేలా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిలో మూసీ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రూ.25 వేలు ఇచ్చి పంపిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. గచ్చిబౌలిలోని భూమిని అమ్ముకొని రూ.10 వేల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆరోపించారు.
రుణమాఫీ, రైతుభరోసా, బోనస్, తులం బంగారం ఎగ్గొట్టినందుకు.. ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బేగంబజార్ ఠాణాలో తనపై కేసు పెట్టించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. బుల్డోజర్లతో తనను, కేటీఆర్‌ను తొక్కించి చంపుతానని రేవంత్‌రెడ్డి బెదిరిస్తే తాము బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత అభిప్రాయాలు చెప్పినా కేసులు పెట్టించడం ప్రజాపాలనా? అని నిలదీశారు.
హైదరాబాద్‌లోని బాపూఘాట్లో భారీ గాంధీ విగ్రహం పెడితే స్వాగతిస్తామని హరీశ్ చెప్పారు. ‘కేసీఆర్ పెట్టిన భారీ అంబేదర్ విగ్రహానికి రేవంత్ దండం పెట్టడు.. ప్రజలు దర్శించుకొనే చాన్స్ ఇవ్వని రేవంత్.. బాపూ విగ్రహం పెడతానంటున్నరు’ అని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ధర్నాలు జరుగుతున్నాయని, మద్దతు ధర ఇవ్వాలని రైతులు కలెక్టర్ కాళ్ల మీద పడుతున్నారని హరీశ్‌రావు చెప్పారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల కాళ్లమీద పోలీసులు పడుతున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు ఆందోళన బాటపట్టారని తెలిపారు. వీరి తిరుగుబాటు నుంచి తప్పించుకోవడానికి పండుగపూట 163 సెక్షన్ పెట్టడం రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
కేంద్రం చేసే అవకాశం ఉన్నా దురాశతో 35 వేల కోట్లను రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) కోసం రాష్ట్రంపై ఎందుకు భారం వేస్తున్నారని హరీశ్‌రావు నిలదీశారు. రీజినల్ రింగ్ రోడ్డును కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నదని, డీపీఆర్ కూడా సిద్ధమైందని హరీశ్ గుర్తుచేశారు. ట్రిపుల్ఆర్కు రూ.35 వేల కోట్లు కూడా మూసీ సుందరీకరణలోని లక్షన్నర కోట్ల నుంచే పెడతామని సీఎం చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా, పూర్తి ఆధారాలతో రాష్ట్ర అప్పుల గురించి తాను చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డి అవే అబద్ధాలు చెప్తూ గోబెల్స్‌ను తలపిస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం చేసిన అప్పు రూ.4 లక్షల 26 వేల 499 కోట్లేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల కాలంలోనే రూ.85 వేల కోట్ల దాకా అప్పు తెచ్చిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల వివరాలను తమకు చెప్పలేదని కాగ్ తన సెప్టెంబర్ నివేదికలో వెల్లడించినట్టు పేర్కొన్నారు. ‘అది రూ.85 వేల కోట్లా?, లక్ష కోట్లా? అనేది కాగ్‌కు ప్రభుత్వం చెప్పాల్సి ఉన్నా ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు దాస్తున్నరు? తీసుకున్న రుణాలను ఏం చేస్తున్నరు?’ అని హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘నీకు ఫుట్‌బాల్ ఒకటే వచ్చు.. నాకు క్రికెట్ మాత్రమే తెలుసు. క్రికెట్లో ఒక్కరిద్దరు గెలువలేరు. అందరూ బాగా ఆడితేనే గెలుస్తారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా యాక్టివ్‌గా ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గోల్ కొట్టేది మేమే.. వికెట్ తీసేది మేమే..కప్ గెలిచేదీ మేమే? ఈ లోపు హిట్‌వికెట్ కాకుండా చూసుకో.. సెల్ఫ్‌గోల్ చేసుకోకు రేవంత్.. నీ మంత్రులే నిన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు’ అని హరీశ్ ఎద్దేశాచేశారు.
తాము అధికారంలోకి వస్తే ఏక్ పోలీస్ విధానం అమలు చేస్తామని ఎన్నికల్లో రేవంత్ చెప్పలేదా? అని హరీశ్‌రావు నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే 39 మంది టీజీఎస్పీ పోలీసులను సస్పెండ్, 10 మందిని డిస్మిస్ చేయడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇంటి వద్ద, సచివాలయం వద్ద స్పెషల్ పోలీసులను భద్రతా విధుల నుంచి తప్పించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ‘రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి.. తనకు రక్షణ కల్పించే పోలీసులను కూడా నమ్మడం లేదు. కానిస్టేబుళ్ల సమస్యలు తెలుసుకునే సమయం సీఎంకు లేదా? ఇలా పంపిస్తే సమస్య తీరుతుందా? వారి ఆత్మాభిమానం దెబ్బతినదా? ఇది ఎంత దుర్మార్గం? క్యాబినెట్ సబ్‌కమిటీ వేసి పోలీసుల సమస్యలపై చర్చించాలి’ అని డిమాండ్ చేశారు. ముందుగా సస్పెండ్, డిస్మిస్ చేసిన పోలీసులను విధుల్లో తీసుకోవాలన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని, లాఫింగ్ స్టాక్ (జోకర్) అయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. ‘హైదరాబాద్‌కు మూడు దిక్కులా సముద్రం ఉందంటరు. మరి గోవాకు ఎందుకు వెళ్లడం అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నయి. కంప్యూటర్ను రాజీవ్‌గాంధీ కనిపెట్టిండంటరు.. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతరంటరు.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి 17,871 ఎకరాలైతే 50వేల ఎకరాలు ముంపునకు గురైందని పుణ్యాత్ముడు సీఎం చెప్తరు. ఏడు గ్రామాలు ముంపులో పోతే 14 గ్రామాలంటరు. బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటరు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదంటరు. రేవంత్‌రెడ్డి అబద్ధ్దాలు చూసి గోబెల్స్ కూడా సిగ్గు పడ్తరు. రేవంత్‌రెడ్డి మాటలపై ప్రజలకు నమ్మకం పోతున్నది. సీఎం మాటలు విన్న పిల్లలు అవి నిజమనుకొని వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంది? పిల్లలు ఎకడ చెడిపోతారోనన్న భయంతో తల్లిదండ్రులు టీవీలు బంద్ పెడ్తునాన్నరు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.
కొండంత కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామనే చిల్లర మాటలు మానుకోవాలని రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు హితవుపలికారు.‘కేంద్రంలో కాంగ్రెస్ మూడు సార్లు ఓడిపోయింది.. రేవంత్‌రెడ్డి ప్రకారం రాహుల్‌గాంధీ ఎక్స్పైరీ మెడిసిన్ అంటున్నారా?’ అని ప్రశ్నించారు. చిల్లర పనులు బంద్‌చేసి హామీల అమలుపై దృష్టి పెట్టాలి. రేవంత్ లాంటి చాలా మంది చిల్లర మాటలు మాట్లాడి అభాసుపాలైండ్రు. ముందు పకనున్న వాళ్లు రేవంత్‌రెడ్డిని ఫినిష్ చేయకుండా చూసుకోవాలి. ఐదేండ్లు రేవంత్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నం’ అని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి పాలసీ కట్టడం కాదని, కూల్చమేనని హరీశ్ విమర్శించారు. మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు చేస్తాం అని ఇష్టమొచ్చినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడం వల్లే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. దేశవ్యాప్తంగా రియల్ వ్యాపారం తగ్గిందని బుకాయిస్తున్న రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఎందుకు పెరుగుతున్నదో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో భవనాల అనుమతుల దరఖాస్తులు పది నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు.
‘14 ఏండ్లపాటు పోరాడి చుక్కనెత్తురు చిందకుండా తెలంగాణను సాధించి, అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డికి పోలికా?’ అని హరీశ్‌రావు దెప్పిపొడిచారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్.. కేసీఆర్ లీడర్.. కేసీఆర్ ఫైటర్.. కేసీఆర్ సాక్రిఫైజర్ (త్యాగశీలి).. కేసీఆర్ విజనర్.. తెలంగాణ సేవియర్.. కేసీఆర్ అచీవర్, ఎక్స్ట్రార్డినరీ పవర్ ఫుల్పర్సన్’ అని కొనియాడారు. సంక్షేమ ప్రదాతకు, శాడిస్టు రేవంత్‌కు పోలికా? అని నిలదీశారు. ‘నిర్మాణాల పాలనకు.. కూల్చివేతల పాలనకు పొంతన ఉన్నదా.. నకకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది’ అని ఎద్దేవాచేశారు.
పరిపాలన చేతగాని రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కుట్రపూరితంగా కేసులు పెట్టాలని చూస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు. ప్రశ్నించే గొంతుక అయిన కేటీఆర్‌పై పగబడుతూ, అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘ఫార్ములా రేసింగ్‌పై ఏసీబీ విచారణ చేయండి.. ఏం కేసులు పెడతారో చూస్తాం’ అని హెచ్చరించారు. దేనికీ భయపడబోమని, చట్ట ప్రకారం పోరాడుతామని చెప్పారు.
హైదరాబాద్‌లోని మూసీ టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి వాడపల్లి వరకు రేవంత్‌తో పాదయాత్రకు తాము సిద్ధమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘రేపా? ఎల్లుండా? టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరం వస్తం. గన్మెన్లు లేకుండా రేవంత్‌రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలి’ అని సవాల్ చేశారు.
తనను డీల్ చేస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ‘నన్ను డీల్ చేయటం కాదు.. మెదట రేవంత్ తన కుర్చీని కాపాడుకోవాలి’ అని చురకలంటించారు. నాలుగేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక రేవంత్‌ను ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు.