హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ‘చనాక-కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులను కట్టిన ఘనత కేసీఆర్‌ది.. సున్నాలు వేయడం.. రిబ్బన్లు కట్ చేయడం, ఫొటోలకు పోజులివ్వడం కాంగ్రెస్ సర్కార్‌కు దక్కింది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హ యాంలో వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే.. సీఎం రేవంత్ గరిటె పట్టుకొని ఫొటోలు దిగ డం సిగ్గుచేటని శుక్రవారం ఎక్స్ వేదికగా వి మర్శించారు. రాత్రింబవళ్లు శ్రమించి ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు అయితే, నిర్మాణానికి వీసమెత్తు కృషిచేయని కాంగ్రెస్ నేతల పేర్లు పెట్టి ప్రజల మనోభావాలను అవమానించడం రేవంత్ సర్కార్ తంతు అని ఎద్దేవా చేశారు. పోరాడి సాధించిన తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే, వాటిపై స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అర్భకత్వాన్ని చూసి జాలేస్తున్నదని పేర్కొన్నారు. ‘తట్టెడు మట్టి తీయకున్నా, ఒక్క ఇటుక పేర్వకున్నా చనాక-కొరాట, సదర్మాట్ బరాజ్‌లను తామే పూర్తిచేసినట్టు నిర్లజ్జగా గొప్పలు చెప్పుకున్న నిన్నటి మీ సభ మీరు చెప్పినట్టు కచ్చితంగా చరిత్రలో నిలబడుతుంది ఉత్తమ్..’ అంటూ సెటైర్లు వేశారు.
రీరన్ పేరిట రేవంత్‌రెడ్డి డ్రామాలు
2016లో కేసీఆర్ మహారాష్ట్ర సర్కార్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, చనాక-కొరాట బరాజ్‌కు అంకురార్పణ చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.1,200 కోట్లు ఖర్చ చేసి బరాజ్, పంప్‌హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్స్టేషన్లతో సహా పనులన్నీ పూర్తిచేసి, 2023 సెప్టెంబర్‌లో విజయవంతగా వెట్న్ పూర్తిచేశారని పునరుద్ఘాటించారు. కాలువలకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1,600 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించామని, కానీ రెండేండ్లలో ఎకరా భూమి కూడా సేకరించని, ఒక్క ఎకరాకు కూడా నీరందించని రేవంత్ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రీరన్, వెట్న్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ప్రశ్నించారు.
నీరు నిలపకుండా రైతుల నోట్లో మట్టి
1.5 టీఎంసీల సామర్థ్యంతో, రూ.500 కోట్లు వెచ్చించి సదర్మాట్ బరాజ్‌ను కేసీఆర్ సిద్ధం చేస్తే, సీంఎ రేవంత్ రెండేండ్లుగా చుక్కనీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లా రైతుల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. రెండేండ్ల క్రితమే 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకా శం ఉన్నా, కాలయాపన చేసి అన్నదాతకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రెండేండ్లుగా కాలయాపన చేసినందుకు సీఎం ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మోసంచేసిన నేత పేరు పెట్టడం సిగ్గుచేటు
చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకున్న చందంగా లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మోసం చేసిన సీ రామచంద్రారెడ్డి పేరును ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్ర జల మనోభావాలను అవమానించడమేన ని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మిం చి ఆదిలాబాద్ ప్రజల నీళ్ల కలలను సాకా రం చేసింది కేసీఆర్ అయితే.. వీసమెత్తు కృషిచేయని నాయకుడి పేరుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని దుమ్మెత్తిపోశారు. గ్రావిటీ కాలువను వదిలి ఎత్తిపోతలు చేపట్టారని కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొనిరావాలని, లేదంటే పచ్చి అబద్ధాలు ఆడినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే రెండేండ్లలో తె చ్చిన అప్పులతో చేసిందేమిటో శ్వేతపత్రం విడుదలచేయాలని సవాల్ చేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీ పాలనపై నమ్మకముంటే మా జోగురామన్న, బీఆర్ఎస్ కార్యకర్తలను శుక్రవారం ఉదయం నుంచి ఎందుకు అరెస్ట్ చేయించావు? పోలీసులను అడ్డంపెట్టుకొని ఎంతకాలం గడుపుతారు? రేవంత్‌రెడ్డీ.. పాలన అంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలాకాలు వేయించుకొని పేరు చెక్కించుకోవడం కాదు.. ప్రజల మనోఫలకం మీద మీ ముద్ర వేసుకొనేలా పనిచేయడమని ఇప్పటికైనా గ్రహించండి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.