ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా డీజిల్ జనరేటర్‌పై స్టోన్ క్రషర్ నడుపుతూ కాలుష్యానికి పాల్పడుతున్నారని స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాసిండ్రు. రెండుసార్లు అధికారుల తనిఖీల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ పట్టుబడినా ఈ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ?
-హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి అనుమతులు లేకుండానే జీవో 111 పరిధిలో రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసిందని, డీజిల్ జనరేటర్లపై నడుపుతూ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై విపక్ష సభ్యులతో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం శాసనసభలో మైనింగ్ శాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణం జరుగుతున్నదని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నదని తెలిపారు. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నదని పేర్కొంటూ పలు ఆధారాలు, అధికారులు ఇచ్చిన నోటీసులను సభ ముందుంచారు. గనుల శాఖ అనేది ప్రభుత్వానికి నాన్-టాక్స్ రెవెన్యూ తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన శాఖ అని, ఇలాంటి శాఖలో అధికారులు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పనిచేస్తే ఖజానాకు అంత ఆదాయం వస్తుందని, ఆ నిధులతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టవచ్చని తెలిపారు. కానీ ఇవాళ మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణం జరుగుతున్నదని, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నదని, రాష్ట్ర ఆదాయానికి తూట్లు పడొద్దు అన్నదే తమ తపన అని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున, నగరాన్ని ఆనుకునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని వివరించారు. ‘రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన మనందరికీ రాష్ట్ర వనరులను కాపాడే బాధ్యత ఉన్నది. జీవో 111ను ఉల్లంఘిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ దందా కొనసాగిస్తున్నది. నిబంధనలు పాటించకుండా, అనుమతులు సైతం లేకుండానే దర్జాగా దందా చేస్తున్నది. నిబంధనల ప్రకారం జీవో111 పరిధిలోని శంషాబాద్ మండలం కోత్వాల్ గూడలో (సర్వే నంబర్ 62, 63) ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు.
కానీ అకడ రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై ఇష్టారాజ్యంగా నడుపుతున్నది. ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 26 (స్టోన్ క్రషర్ రూల్స్ 2026) ప్రకారం, స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ (ఎండీఎల్) ఉండాలి. పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి సీఎఫ్ఈ (కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్), సీఎఫ్‌వో (కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్) సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఇందులో ఏ ఒక నిబంధన కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ పాటించలేదు. రాఘవా కన్స్ట్రక్షన్స్కు ఎండీఎల్ లైసెన్స్ కానీ, సీఎఫ్ఈ, సీఎఫ్‌వో సర్టిఫికెట్లు కానీ లేవు. రిజిస్ట్రేషన్ కూడా లేదు. విద్యుత్తు కనెక్షన్ లేకుండా డీజిల్ జనరేటర్ల మీద క్రషర్ నడుపుతున్నారు. కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే ఈ అనుమతులన్నీ ఉండా లి. అవి లేనందున డీజిల్ జనరేటర్లతో క్రషింగ్ చేస్తున్నారు’ అని ఆధారాలతో వివరించారు.
ప్రభుత్వం ఎందుకు మౌనం?
ఈ దారుణమైన దోపిడీని క్రోనాలజీ ప్రకారం సభ ముందు పెడుతున్నట్టు హరీశ్ పేర్కొన్నారు.‘2025, మే 21న మైనింగ్ శాఖ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్‌పై తనిఖీకి ఆదేశించగా రెవెన్యూ, పీసీబీ, ఎన్పీడీసీఎల్, మైనింగ్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలు పట్టుకున్నారు. 2026, ఫిబ్రవరి 13న డిమాండ్ నోటీసుకు ఆదేశించారు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ పట్టించుకోలేదు. 2026, మార్చి 4న మళ్లీ తనిఖీ చేయగా ఏకంగా 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికింది. 2026, మార్చి 13న మరో షోకాజ్ నోటీస్ (నం-788) ఇచ్చారు. 2026, మార్చి 5న ఎలాంటి అనుమతులు లేకుండా డీజిల్ జనరేటర్‌పై స్టోన్ క్రషర్ నడుపుతున్నారు, కాలుష్యానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశారు. మైనింగ్ చట్టం ప్రకారం.. ఎండీఎల్ లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి రూ.10,000, రెండోసారి కూడా పట్టుబడితే రూ.25 వేల జరిమానాతో పాటు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండు సార్లు పట్టుబడింది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉన్నది? ఆ కంపెనీపై ఎందుకింత ప్రేమ? ఇప్పటివరకు మీరు తీసుకున్న కఠిన చర్యలు ఏమిటో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా?
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడి స్టోన్ క్రషర్లో చిన్న తప్పు జరిగిందని ఆయనను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పార్టీ మంత్రులకు ఒక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు.
హౌస్ కమిటీ వేయండి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబులాపురం మైన్స్పై ఆరోపణలు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హౌస్ కమిటీ వేసి, ఆరోపణలు చేసిన నాగం జనార్దన్‌రెడ్డినే కమిటీకి చైర్మన్‌గా వేశారని హరీశ్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అలానే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ‘నేను ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా.. మీ దగ్గర నిజాయితీ ఉంటే.. ఈ కుంభకోణంతో మీకు సంబంధం లేకపోతే.. ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయండి. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఆయన గతంలో మాతో కలిసి పనిచేసిండ్రు. కానీ, తప్పు జరిగినప్పుడు.. ఆ తప్పును ఆధారాలతో సహా బయటకు తీయడం, రాష్ట్ర ఖజానాను కాపాడటం ప్రతిపక్షంగా మా బాధ్యత’ అని వివరించారు.
నేను చెప్పింది తప్పయితే ఉరి తీయండి
హరీశ్ మాట్లాడుతుండగా మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ ‘వ్యక్తిని, కంపెనీని లక్ష్యంగా చేసుకొని అప్రదిష్టపాలు చేసేలా మాట్లాడటం సరికాదు’ అని పేర్కొన్నారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ ‘నేను అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరి తీయండి.. శాసన సభ్యుడిగా సస్పెండ్ చేయండి’ అని సవాల్ విసిరారు. అదే సమయంలో తాను చెప్పింది నిజమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారిక డాక్యుమెంట్లు, డేటా ఆధారంగా తాను మాట్లాడుతున్నట్టు చెప్పారు. స్టోన్ క్రషర్లో చిన్న పొరపాటు జరిగిందనే కారణంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమ్ముడిని నెలరోజులు జైల్లో పెట్టారని పేర్కొంటూ, ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి మరో న్యాయం ఉంటుందా? అని నిలదీశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని సూచించారు. ‘నేను చేస్తున్నది ఆరోపణలు కాదు.. డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చిన నోటీసులనే చదివి చెప్తున్నా.. ఎన్ని విచారణలు చేస్తారో చేయాలి.. కానీ, ముందుగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్ధాలు
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీశ్ నిప్పులు చెరిగారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటికి ఆయన భార్య, కొడుకు, తమ్ము డు దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయానా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి పేరని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసని చెప్పారు. పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్షరెడ్డి, తమ్ముడు ప్రసాద్‌రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ ఇతరులది ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయినా అది పొంగులేటి దూరపు బంధువులదని అసెంబ్లీ సాక్షిగా పేర్కొంటూ, సీఎం అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. సభలో కాంగ్రెస్ సరార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని, అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెప్తున్నదని దుయ్యబట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయమని వాపోయారు.
పొంగులేటి రాజీనామా చేయాలి
‘రాఘవ కన్స్ట్రక్షన్స్కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఏం సంబంధం? అని మైనింగ్ శాఖ మంత్రి అడుగుతున్నారు. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై మేము ట్విట్టర్లో పెడితే మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి ‘నాపై మొరిగే కుకలను గొలుసు కట్టి ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు’ అన్నారు. ఆయనకేం సంబంధం లేకపోతే ఎందుకు భుజాలు తడుముకున్నారు?’ అని హరీశ్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి తక్షణమే నైతికంగా రాజీనామా చేసి విచారణ ఎదురోవాలని డిమాండ్ చేశారు. ‘నిన్న మంత్రి సీతక మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి.. మేం చేస్తే తప్పేంటి?’ అన్నట్టు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నరు. కాళేశ్వరం కమిషన్ వేసిండ్రు. విద్యుత్తు కమిషన్ వేసిండ్రు. మీ చేతుల్లో అధికారం ఉన్నది. ఎంక్వయిరీ చేసుకోండి’ అని తేల్చిచెప్పారు.
మూసీలో కాలుష్యం జరుగవద్దని ముఖ్యమంత్రి అంటరు. కానీ ఇకడ రాఘవ కన్స్ట్రక్షన్స్ వల్ల మూసీ నది, గండిపేట్, హిమాయత్‌సాగర్ కాలుష్యమవుతున్నయని మైనింగ్ అధికారులే లిఖిత పూర్వకంగా రాసిచ్చిండ్రు. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తరు?
-హరీశ్‌రావు
రాఘవ కన్స్ట్రక్షన్స్కు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఏం సంబంధమని మైనింగ్ శాఖ మంత్రి అడుగుతున్నరు. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై మేం ట్విట్టర్లో పెడితే మంత్రి పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టి ‘నాపై మొరిగే కుకలను గొలుసు కట్టి ఎలా కట్టేయాలో మాకు బాగా తెలుసు’ అన్నరు. ఆయనకు ఏం సంబంధం లేకపోతే ఎందుకు భుజాలు తడుముకున్నరు?
-హరీశ్‌రావు