వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి సీతక్క తమను పట్టించుకోవడంలేదని, సీతక్క మంత్రయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామని, ఇప్పుడు విలువ లేకుండాపోయిందని.. ములుగు జిల్లాలోని ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకుడు నాగన్న పేరుతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖరాశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో లేఖప్రతులను విలేకరులకు ఇచ్చారు. ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆవేదన ఇదని పేర్కొన్నారు. ‘సీతక మంత్రయితే ఆమెను నమ్ముకున్న మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఆ ఒకడు తప్ప ఎవ్వరి బతుకులు బాగుపడలేదు. మాకు విలువ లేదు. దొంగ సర్టిఫికెట్లు అమ్ముకొని జైలుకు పోయి వచ్చినోడు ఇవ్వాళ మా జిల్లాను, మంత్రి సీతకను శాసిస్తున్నాడు.
అదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా ఉన్నందున ఆమె ఇబ్బందిని మేం అర్థం చేసుకోగలం. కార్యకర్తల బాగోగులు చూడాల్సిన జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లాను, మమ్మల్ని, పార్టీని పట్టించుకోవడంలేదు. ఇసుకక్వారీల కలెక్షన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లు తప్ప వేరే ఆలోచన లేదు. 20 ఏండ్లకు పైగా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఇలాంటి దుర్మార్గుడిని చూడలేదు. దొంగ సర్టిఫికెట్లు తయారుచేసి అమ్ముకుంటూ జైలుకు పోయినోడు మమ్మల్ని శాసిస్తున్నడు. అతడితో పాటు ఓ సీఐ పార్టీ పేరును, పదవిని అడ్డుపెట్టుకొని భూములు కబ్జా చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు జిల్లాలో నాయకులు, కార్యకర్తల ఫోన్లు ఎత్తడంలేదు. అత్యవసర పరిస్థితి వచ్చినా పట్టించుకోడు. మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులం దికుతోచని స్థితిలో చికుకున్నాం. సీతకకు చెప్తే పట్టించుకోరు. ఆ ఒకడి వల్ల పార్టీ బాగా నష్టపోతున్నది. సీతక ఆస్తులకు నేను బినామీని అని బెదిరిస్తున్నాడు. అశోక్ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే జడ్పీ చైర్మన్ చేయాలని సీతక చూస్తున్నది. దయచేసి అశోక్‌తో ములుగు జిల్లా కార్యకర్తలకు విముక్తి కల్పించగలరని మా మనవి’ అని లేఖలో పేర్కొన్నారు.