హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కేశవసాయి, రవికుమార్, రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్‌తో కలిసి మొత్తం 133 యూనిట్ల (ఒకో యూనిటు 21 చొప్పున)ను కొని, తమకు డబ్బు చెల్లించలేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిరుడు ఆగస్టు 13 నుంచి 23 తేదీల మధ్యన 10 రోజుల్లో వీటిని సరఫరా చేశామని, తమ నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నా.. ఇప్పటివరకు చెల్లించాల్సిన నగదును జమ చేయలేదని, పలుమార్లు పశుసంవర్ధక శాఖ ఆఫీసుకు వెళ్లి అడిగినా ఫలితం లేకపోయిందని ఏడుకొండలు ఆరోపించారు. ఈ విషయాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఐఆర్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు కాంట్రాక్టర్లయిన తండ్రీ కొడుకులను నిందితులుగా పేరొన్నారు. దీనిపై త్వరలోనే విచారణ ప్రారంభం కానున్నది. అయితే, పశుసంవర్థక శాఖలో మాయమైన ఫైళ్ల గురించి కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించనున్నారు.
ముమ్మాటికీ కక్ష సాధింపే: శ్రీనివాస్ యాదవ్
వాస్తవాలను తెలుసుకోకుండా గొర్రెల పంపణీ కేసును ఏసీబీకి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరును చేర్చి, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. అనుమానాలుంటే తొలుత శాఖాపరమైన దర్యాప్తు జరపాలి కానీ, ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటమేనని పేర్కొన్నారు. బడుగు నేతలను వేధించి అణగదొకాలనే కుట్రలో భాగంగానే తెరపైకి తలసాని పేరును తీసుకొచ్చారని, ఆయనను వేధిస్తే బలహీనవర్గాల ప్రజలు తిప్పికొడతారని శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు.