నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 18: రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో సుమారు 250 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రాజుపేటలోని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. నర్మాలలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ముస్తాబాద్ మండలం మోహినికుంట, మద్దికుంటలో వరి పంట, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. మెట్‌పల్లిలోని బస్టాండ్ చౌరస్తాలో గాలి దుమారానికి ట్రాఫిక్ స్టాండ్ ప్రధాన రహదారిపై పడింది.
గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మండలం గోదూర్-తిమ్మాపూర్ గ్రామాల మధ్య 33/11 కేవీ విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో మండలమంతా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎర్దండి గ్రామంలోని ఒడ్డెర కాలనీలో 9 గుడిసెల పైకప్పులు ఎగిరిపడ్డాయి. వంటసామగ్రి, బట్టలు, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బాదిగూడ సోంపెల్లి, కోసుగూడ, తలమద్రి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో వ్యాక్సినేషన్ గది దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల నష్టం జరిగింది.
పిడుగుపాటుకు 40 గొర్రెలు మృత్యువాత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడిలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగుపడటంతో కడారి దేవయ్యకు చెందిన 40 గొర్రెలు మృతిచెందాయి. బీబీపేట మండలంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగి కరెంట్ వైర్లపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో ప్రవీణ్ ఇంటి రేకులు ఎగిరిపడగా, పెళ్లి ఖర్చుల కోసం తీసుకొచ్చిన రూ.40 వేల నగదును లెక్కిస్తుండగా, బలమైన గాలులు వీయడంతో నోట్లు కొట్టుకుపోయాయి. తుజాల్పూర్, యాడారం, బీబీపేట, మాందాపూర్, జనగామ తదితర గ్రామాల్లో మామిడికాయలు రాలిపోయాయి. వరి పైర్లు నేలవాలాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో గాలిదుమారం రైతులను ఆగం చేసింది. తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసింది.
పిడుగుపడి 9 మందికి గాయాలు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రాత్రి పిడుగుపడి తొమ్మిది మంది రైతులకు గాయాలయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభంకాగానే రైతులంతా కొనుగోలు కేంద్రం వద్దకు పరుగులు తీశారు. ఇదే సమయంలో పిడుగు పడడంతో ఆ శబ్దానికే గ్రామానికి చెందిన పారుపల్లి నందిని, వంగపల్లి సుశాంత్‌రెడ్డి, పాకల మల్లయ్య, ఊడెం మంగమ్మ, భీంరెడ్డి భారతమ్మ, భీంరెడ్డి జనార్దన్‌రెడ్డి, వంగపల్లి రంగారెడ్డి, దండ్యాల మల్లారెడ్డి, గంట పద్మ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే 108లో వారిని జనగామ ఏరియా వైద్యశాలకు తరలించారు. అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంటనే ఏరియా వైద్యశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందానికి సూచించారు. అవసరమైతే హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం పూట ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వేళ వర్షం పడుతున్నది. ఈ అనూహ్య మార్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం మెదక్‌లో 42, ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని పేరొంది. వచ్చే మూడురోజులూ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో వర్షం పడింది. శనివారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబగద్వాల జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరించింది. ఆదివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో వానలు కురువొచ్చని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.