నర్సాపూర్: ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పు ఓవైపు.. వనగండ్ల వానతో నెలరాలిన వరి ధాన్యం మరోవైపు రైతన్నలను గుండె పగిలేలా చేస్తున్నాయి. మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్, శివంపేట్ మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం భయంకరమైన వనగండ్లతో కూడిన భారీ వర్షం రైతన్నలను అతలాకుతలం చేసింది.
భారీ సంఖ్యలో వడగండ్లు పడటంతో చేతికొచ్చిన వరి పంట ధాన్యం నేలరాలింది. రోజూ లాగానే శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతన్న నేలరాలిన ధాన్యాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యం కుప్పలు కూడా వర్షార్పితం అవడం జరిగింది. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.