నల్లగొండ, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణప్రతినిధి): ప్రధాని మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మహబూబ్నగర్ పర్యటకు వచ్చినా పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించలేదని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోదీ ఎన్ని పర్యటనలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు మంజూరు చేయలేదని? నీతి ఆయోగ్ చెప్పినట్టుగా మిషన్ భగీరథకు, కేంద్ర సంస్థలు సూచించిన మిషన్ కాకతీయకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అవకాశం దొరికినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కేందుకే యత్నిస్తున్నారని అన్నారు.