Congress | నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరుకు బీజం వేసింది. ఎమ్మెల్సీగా తనకున్న పరిధిలో జిల్లాలో ఎక్కడైనా పనులను ప్రతిపాదించే హక్కు తనకు ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా భావిస్తుంటే, తనకు తెలియకుండా జిల్లాలో పనులను ప్రతిపాదిస్తే ఊరుకునేది లేదని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అధికారులకు తలనొప్పిగా మారి ఏకంగా కలెక్టర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసు ఇచ్చేవరకు దారితీసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా తనకున్న అధికారంతో గత నెల రెండో వారంలో రూ.3 కోట్ల విలువైన ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించారు.
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.1.50 కోట్లు, నకిరేకల్ నియోజకవర్గంలో రూ.70 లక్షలు, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో మిగతా పనుల కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆమోదం కోసం పంపించారు. తుమ్మల వెంటనే ఆమోదం తెలపడంతో తిరిగి కలెక్టర్ త్రిపాఠి వాటి గ్రౌండింగ్ కోసం ప్రొసీడింగ్స్ జారీచేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇలా జారీ అయిన ప్రొసీడింగ్స్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ నల్లగొండ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి కలెక్టర్ ఇలా త్రిపాఠిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. గుత్తా ప్రతిపాదనలను తనకు తెలియకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి ఎలా పంపిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ, తక్షణమే వాటిని రద్దుచేస్తూ ఆదేశాలివ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దాంతో గత నెల 25న తాను ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మర్నాడే రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
తన ప్రతిపాదనల రద్దు వ్యవహారాన్ని గుత్తా సుఖేందర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీని గుత్తా రంగంలోకి దించినట్టు తెలిసింది. దాంతో పనుల రద్దుపై వివరణ కోరుతూ ఈ నెల 4న నల్లగొండ కలెక్టర్‌కు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. స్వయంగా మండలి చైర్మన్ వద్ద హాజరై పనుల రద్దుకు కారణాలను చూపుతూ వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నోటీసు అందుకున్న కలెక్టర్ ఇదే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అసెంబ్లీ సెక్రటరీతో మాట్లాడినట్టు తెలిసింది. ఇదే విషయమై ఇన్చార్జి మంత్రి తుమ్మలతోనూ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడినా మండలి చైర్మన్ గుత్తా వెనక్కి తగ్గినట్టు లేదని సమాచారం. ఇప్పటికే సుమారు రూ.50 లక్షల విలువైన పనులు సైతం వివిధ దశల్లో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని తాడో పేడో తేల్చుకోవాలని గుత్తా భావిస్తున్నట్టు సమాచారం. వీటికితోడు తన కుమారుడు అమిత్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తన అనుచరుల పట్ల కొంతకాలంగా మంత్రి కోమటిరెడ్డితోపాటు ఆయన ముఖ్య అనుచరులు వ్యవహరిస్తున్న తీరు కూడా గుత్తా ఆగ్రహానికి తోడైనట్టు తెలిసింది. మండలి చైర్మన్ గుత్తా, మంత్రి కోమటిరెడ్డి మధ్య ఆధిప్యత పోరు జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తున్నది.