చిట్యాల, డిసెంబర్ 10 : దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని రోల్ మాడల్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా ప్రపంచంలో ఆదర్శంగా నిలబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఓవైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని సాధించడానికి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినట్టు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. విజన్ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
దేశంలో 70 వేల టీఎంసీల నదీ జలాలు ఉండగా కేవలం 30 వేల టీఎంసీలనే ఉపయోగిస్తున్నారని, అలాగే నాలుగు లక్షల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్తు ప్రాజెక్టులు ఉంటే కేవలం రెండు లక్షల మెగావాట్లు మాత్రమే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. వాజపేయి కాలంలో నదీ జలాల అనుసంధాన ప్రాముఖ్యత వివరించినప్పటికీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న కేసీఆర్ వాటిని పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదిన్నరేండ్లలో కేసీఆర్ అమలు చేస్తున్న వంద రకాల సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులకు అడ్డుకట్ట వేస్తూ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి భాష, తీరు మారాలని సూచించారు. షర్మిలది పాదయాత్ర కాదని, తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని తిట్టే యాత్రగా సాగుతున్నదని విమర్శించారు. సమైక్యవాదులు మళ్లీ తెలంగాణపై కుట్ర పన్నుతున్నారని, తెలంగాణపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గపు ఆలోచనలకు నిదర్శనమని ఆరోపించారు.