హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ) : గురుకులాలు, జడ్పీ స్కూళ్లల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్ వద్ద బీఆర్ఎస్వీ మెరుపు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పోలీసులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సహా విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు, ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే అస్తవ్యస్తంగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లపై నమ్మకం పోతున్నదని తెలిపారు. సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ పర్యటిస్తుందని తెలిపారు. అరెస్టయిన బీఆర్ఎస్వీ నేతలను కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీశ్రీప్రసాద్, ఆంజనేయగౌడ్ పరామర్శించారు.