హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర సర్కారుకు టీఎస్‌యూటీఎఫ్, గురుకుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి సమ్మె నోటీసు అందజేసింది.
28న మహాధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద యూటీఎఫ్, గురుకుల జేఏసీ నేతలు జంగయ్య, మామిడి నారాయణ, మధుసూదన్ మాట్లాడుతూ.. తెలంగాణలో 5శాఖల పరిధిలోని సొసైటీల కింద 1,022 గురుకులాలు ఉన్నాయని, వీటిలో సుమారు 600లకు పైగా అద్దె భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మెస్‌చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కష్టమవుతుందని, ఇటీవల నిర్ణయించిన పనివేళలు శాస్త్రీయంగా లేవని, విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని ఇప్పటికే పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించకపోవడంపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 18,19 తేదీల్లో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసనలు, 22,23 తేదీల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత, 28న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో చావ రవి, నర్సింహగౌడ్, జగదీశ్, భిక్షం, గణేశ్, ఏవీ చారి పాల్గొన్నారు.