హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నాన్ రెగ్యులర్ స్టాఫ్, అదనపు స్టాఫ్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఆదేశించారు. గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీచేశారు. గురుకులాల్లో బోధన సిబ్బంది ఎంతమేరకు అవసరమో వెల్లడించాలని సూచించారు. సిబ్బందిని తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీల్లో రెగ్యూలర్ సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామని ఆ సొసైటీ జాయింట్ సెక్రటరీ తెలిపారు.
ఒక్క రోజులోనే వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దారుణమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. మూడు నెలలుగా వీరికి వేతనాలు కూడా ఇవ్వలేదని మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో ఉన్న ఎస్సీ గురుకులాల నుంచి దాదాపు వెయ్యి మందికిపైగా గెస్ట్ లెక్చరర్లను తీసివేయడం జరిగింది. వీళ్లకు మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదంట. వీళ్లందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు. వివక్షపూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైన ఎస్సీ బహుజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతున్నది. అయినా, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమీ పట్టనట్టు గుర్రుపెట్టి నిద్రపోతూనే ఉన్నారు. ఈ పేద విద్యార్థుల కుటుంబాల ఉసురు తగుల్తది. మీరు ఇట్లనే నిద్రపోతే చరిత్రలో దళితద్రోహులుగా మిగిలిపోతారు. ఖబర్దార్’ అని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.