హైదరాబాద్, ఏప్రిల్6 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన నిర్ణయాల్లోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా, కసరత్తు లేకుండానే కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు గురుకుల ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషనే నిదర్శనంగా నిలుస్తున్నది. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రోజునే గురుకుల ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేశారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లు, వృత్తివిద్యా కాలేజీలు, సైనిక కళాశాల, సాధారణ ఇంటర్ గురుకుల కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం సొసైటీ సెక్రటరీ తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, మే13న రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హులైన పదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. కాగా, సొసైటీ నిర్ణయించిన 13వ తేదీనే పాలిటెక్నిక్ రాతపరీక్షను నిర్వహించనుండటం గమనార్హం. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, సివిల్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ తదితర వృత్తివిద్యా కోర్సుల్లో చేరేందుకు ఏటా పాలిటెక్నిక్ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ దాదాపు 2నెలల క్రితమే ఖరారు చేసింది. దరఖాస్తులను స్వీకరిస్తున్నది. 20వతేదీతో దాని గడువు కూడా ముగియనుండగా, మే13న రాతపరీక్షను నిర్వహించనున్నారు. బోర్డ్ టైం షెడ్యూల్‌ను మార్చే అవకాశమే ఉండబోదు. ఒకే రోజున రెండు పరీక్షలను ఎలా రాస్తారనేది సొసైటీ ఉన్నతాధికారులే చెప్పాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.