హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధమని గురుకుల టీచర్లు మం డిపడుతున్నారు. ఈ నెలకు సంబంధించి ఇప్పటికీ ఎస్సీ, బీసీ, ఎస్టీ గురుకుల సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదని ఉదహరిస్తున్నారు. మొదటి తారీఖున వేతనం అనేది అందని ద్రాక్షగా మారింది. జనరల్ గురుకుల సిబ్బందికి తొలుత, మైనార్టీ గురుకుల సిబ్బందికి బుధవారం మధ్యాహ్నం వేతనాలు చెల్లించారు.
కానీ ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల రెగ్యులర్ సిబ్బందికి మాత్రం వేతనాలు చెల్లించలేదు. ఏప్రిల్‌లో కూడా 10వ తేదీ దాటిన అనంతరమే వేతనాలు చెల్లించారని ఉదహరిస్తున్నారు. ఆయా గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, సీవోఈల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం సిబ్బందికి మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించని దుస్థితి నెలకొన్నది.