మోర్తాడ్/ముప్కాల్, డిసెంబర్ 18: గురుకులంలో అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్‌కు చెందిన లింగం తన కుటుంబంతో ముప్కాల్‌కు వచ్చి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు సాయిలిఖిత(14) ను మూడేండ్ల క్రితం పోచంపాడ్‌లోని గురుకులంలో చేర్పించగా ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నది. 15 రోజుల క్రితం చెవిలో నొప్పి ఉన్నదని జీఎన్ఎంకు చెప్పడంతో స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించి వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బాలికను మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
బాలికకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో చికిత్స అందిస్తున్న సమయంలో జాండీస్ రావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం లిఖిత మృతి చెందింది. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగేందుకు పాఠశాల వైపు వస్తుండగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. బాలిక ఆరోగ్యవిషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి, విద్యార్థినిని వారికి అప్పజెప్పినట్టు ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాధిక తెలిపారు. గురుకుల విద్యాలయంలో భోజనం సరిగా ఉండదని, ప్రిన్సిపాల్ ఎప్పుడూ లీవ్‌లో ఉండటం, పిల్లల విషయంలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోక పోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతికి కారణమైన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని కోరారు.
విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా గురువారం పాఠశాలను సందర్శించారు. గురుకుల విద్యాలయంలోకి తమను అనుమతించకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొని వారిని ఓదార్చారు. హాస్టల్లో నీటి, డ్రైనేజీ సమస్య, వాష్ రూమ్‌లకు డోర్లు కూడా సరిగ్గాలేవని, విద్యార్థినులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినా సమాచారం అందించడంలేదని వారు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చారు.