Khammam | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ఎనిమిదో తరగతి విద్యార్థి మరణించాడు. అయితే గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే. తిరుమలాయపాలెం కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి హరీశ్– ప్రియాంక కుమారుడు సాత్విక్ (14) మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే ఇవాళ ఉదయం 5 గంటలకు లేచి గురుకుల ప్రాంగణంలో సాత్విక్ ఆడుకున్నాడు.
రన్నింగ్ చేసిన వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే సపర్యలు చేశారు. హుటాహుటిన ఖమ్మం సర్వజనాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే సాత్విక్ మరణించాడని అంటున్నారు.
అయితే సాత్విక్ మరణంపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతికి మరేదో కారణం ఉండొచ్చని ఆరోపిస్తున్నారు.