Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈ చదువు చదవలేకపోతున్నానని నోట్ రాసి గురుకుల కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గద్వాల జిల్లా మల్దకల్‌కు చెందిన ఉప్పరి నగేశ్ కుమార్తె ప్రియాంక (17) మహబూబ్‌నగర్ జిల్లా రాంరెడ్డిగూడ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. సోమవారం నాడు బాత్రూంలోని కిటికీకి ప్రియాంక ఉరివేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ప్రియాంక మృతిచెందింది. హాస్టల్లో ఉండటం తనకు ఇష్టం లేదని మూడు రోజుల క్రితం ప్రియాంక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది.. అయితే అక్కడకే ఉండి చదువుకోవాలని ఆమె తండ్రి చెప్పాడని పోలీసులకు తోటి విద్యార్థులు తెలిపారు.
Priyanka1
అయితే గ్రామానికి చెందిన యువకుడు ఖదీర్ అనే యువకుడు తన కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి నగేశ్ తెలిపారు. ఖదీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప్పరి నగేశ్ డిమాండ్ చేశారు. దాదాపు 200 మందితో కలిసి మల్దకల్ బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రియాంక మరణం వెనుక ఎవరున్నా వదిలేదని లేదని.. నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.