దమ్మపేట రూరల్, ఆగస్టు 2 : ‘నాణ్యమైన ఆహారం లేదు.. మెనూ అమలు అసలే లేదు.. అన్నంతో తయారుచేసిన అల్పాహారం (పులిహోర) తినలేకపోతున్నాం.. అన్నం బిరుసు గా ఉండి మింగుడు పడటంలేదు’ అని భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉదయం 9 గంటల వరకు అల్పాహారం అందించకపోవడంతో అదే సమయానికి హాస్టల్‌కు వచ్చిన విలేకరులకు తమ కష్టాలు చెప్పుకున్నారు.
మెనూ ఏమాత్రం అమలు చేయడం లేదని, కూరగాయలు సక్రమంగా పాఠశాలకు రావడంలేదని, ఉదయం బూస్టు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రశ్నించిన వారికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏటీడీవో చంద్రమోహన్‌ను వివరణ కోరగా చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలోని సమస్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.