నేరేడుచర్ల, నవంబర్ 19: రాష్ట్రంలో కొంతమంది మంత్రులు మామూళ్లకు కక్కుర్తిపడడంతో వారితో కుమ్మకైన మిల్లర్లు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదల, కృషితోనే నేడు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. మంత్రులు చెప్తున్న ధాన్యం లెక్కలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వారి చెప్పేవన్నీ గాలి లెక్కలు, దొంగ లెక్కలేనని విమర్శించారు. కాళేశ్వరం నీటితో సంబంధం లేకు ండానే ఇంత పంట పండిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల చిల్లరమాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వ్యవసాయంపై అనుభవంలేని రేవంత్‌రెడ్డి సీఎం కావడం బాధాకరమని, మంత్రి తుమ్మలకు వ్యవసాయంపై అనుభవం ఉన్నప్పటికీ మాట్లాడలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రు లు కేసీఆర్, కాళేశ్వరంపై బురదజల్లడం మానుకోవాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, నేరేడుచర్ల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు.