న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభాగం గుజరాత్‌కే దక్కాయి. దేశవ్యాప్తంగా 10 ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తే అందులో నాలుగు భారీ ప్రాజెక్టులు మోదీ సొంత రాష్టం కైవసం చేసుకుంది. మైక్రాన్ టెక్నాలజీ(రూ. 22,516 కోట్లు), టాటా అండ్ పవర్‌చిప్ జేవీ (రూ.91,000, ధొలేరా), సీజీ పవర్-రెనెసస్-స్టార్స్(రూ. 7,600 కోట్లు, సనంద్), కేనెస్ సెమికాన్(రూ. 3,300, సనంద్) వంటి ప్రధాన ప్రాజెక్టులు గుజరాత్‌కే దక్కాయి. వీటి మొత్తం విలువ రూ.1,24,416 కోట్లు. మిగిలిన ఆరు ప్రాజెక్టులలో ఒకటి మాత్రం పంజాబ్‌కు దక్కగా మిగిలిన ఐదు బీజేపీ, ఎన్డీఏ అధికారంలో ఉన్న అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్నాయి.
ఇటీవల మంజూరైన నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులతో కలిపి దేశంలోని ఆరు రాష్ర్టాల్లో 1.60 ట్రిలియన్ల విలువైన మొత్తం 10 సెమీకండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో 40 శాతం పరిశ్రమలు.. అంటే నాలుగు ఒక్క గుజరాత్‌కే మంజూరు కావడం గమనార్హం. మిగిలిన ఆరు పరిశ్రమల్లో ఒడిశా 2, అస్సాం, యూపీ, ఏపీ, పంజాబ్‌లో ఒక్కొక్కటి ఏర్పాటవుతున్నాయి. ఎకోసిస్టం విషయంలో, నైపుణ్యం విషయంలో ఈ రాష్ర్టాలన్నీ తెలంగాణ ముందు దిగదుడుపే. కేవలం బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ర్టాలు కావడమే వాటికి ఉన్న ఏకైక అర్హతగా చెప్పవచ్చు.
ముఖ్యంగా, తెలంగాణను కాదని అస్సాం, ఒడిశా, ఏపీ వంటి రాష్ర్టాలకు సెమీకండక్టర్ పరిశ్రమలు మంజూరుచేయడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తున్నది. దీన్నిబట్టి కేంద్రం తెలంగాణపై ఏ స్థాయిలో వివక్షను ప్రదర్శిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లోనూ తెలంగాణలో ఉన్నన్ని అంతర్జాతీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు లేకపోయినా, చిప్ టెక్నాలజీకి అనువైన ప్రాంతం కాకపోయినా.. ప్రధాని సొంత రాష్ట్రం అన్న ఒక్క కారణంతో దశాబ్దకాలంగా ప్రాజెక్టులన్నింటినీ గుజరాత్ వైపు మళ్లిస్తుండటం గమనార్హం. కాగా, తెలంగాణకు కావాల్సిన ఎకోసిస్టం.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ర్టాలకు అవసరంలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.