Vemula Prashanth Reddy | అసెంబ్లీలో బీర్ఎస్ గొంతు నొక్కారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జీరో అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో చర్చలకు అవకాశం ఇవ్వలేదని.. ప్రజా సమస్యలపై మాట్లాడదామంటే మైకులు కట్టేశారని.. ఇదేంటని అడిగితే మార్షల్స్‌తో బయటకు తరలించారని మండిపడ్డారు.
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను తిట్టడానికే అసెంబ్లీని వినియోగించుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందని విమర్శించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా సభ ఎప్పుడూ జరగలేదని అక్బరుద్దీన్ కూడా అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా కాంగ్రెస్ తీరును తప్పుబట్టిందని తెలిపారు. రేవంత్ సభా నాయకుడిగా కాకుండా అటవిక రాజులా వ్యవహరించారని అన్నారు. సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పుడు దోవ పట్టించారని విమర్శించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్లేదని అన్నారు. కేసీఆర్‌ను తిట్టుడు.. గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించిందని అన్నారు.
అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కళ్లున్న కబోధి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తాము మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా వంద రోజుల్లో అమలుచేస్తామన్న హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని అన్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడైనా ఉద్యోగాలు భర్తీ చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను ఎంపిక చేస్తే.. ఈ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఒప్పందంలో వ్యవసాయ మోటార్లకు మినహాయింపు ఉందని అన్నారు. ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తొక్కిపెట్టి తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అబద్ధాల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.