హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఆర్థికంగా అడ్డుకునేందుకు కేంద్రం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి విషయంలో అక్కసు వెళ్లగక్కుతున్నది. చివరికి జీఎస్టీ పరిహారం సైతం సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నది. ఒకవైపు పన్నులను సెస్‌లు, సర్‌చార్జీల రూపంలోకి మార్చుకోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన పన్నులు కేంద్ర ఖజానాకు చేరుతున్నాయి. మరోవైపు జీఎస్టీ పరిహారంలో మెలికలు పెడుతూ ప్రతిఏటా ఎంతోకొంత పెండింగ్ పెడుతున్నది. దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. అయితే, జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు ఐదేండ్లపాటు రాష్ర్టాలకు పరిహారం ఇస్తామని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ వార్షిక వృద్ధిరేటు 14 శాతం కంటే ఎంత తక్కువగా ఉంటే, ఆ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు పేర్కొన్నది.
తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నా కేంద్రం నుంచి రావాల్సిన వాటా రావడం లేదు. దేశంలో పెద్ద రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణ జీఎస్టీ వసూళ్లు సాధిస్తున్నది. చివరికి కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం కూడా జీఎస్టీ పరిహారం అందించడం లేదని తెలంగాణ ఆరోపిస్తున్నది. గత మూడేండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.2,433 కోట్ల జీఎస్టీ పరిహారం రావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రూ.16,570 కోట్లు మాత్రమే అందాయి. ఇది దేశంలోని అన్ని ప్రధాన రాష్ర్టాల కంటే ఎంతో తక్కువ. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.1,371 కోట్లు, 2022-23కు సంబంధించి రూ.1,061 కోట్ల జీఎస్టీ పరిహారం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సి ఉన్నదని రాష్ట్రం చెబుతున్నది.
బకాయిలు చెల్లించాలని రాష్ట్రం పదేపదే కేంద్రానికి విన్నవిస్తున్నది. కానీ, కేంద్రం నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదు. జీఎస్టీని కేంద్రం 2017 జూలై 1న ప్రవేశపెట్టింది. 2022 జూన్ 30 నాటికి జీఎస్టీ పరిహారం చెల్లించే కాలం ముగిసింది. జీఎస్టీ పరిహారం గడువును మరో ఐదేండ్లపాటు పొడిగించాలని తెలంగాణ సహా రాష్ట్రాలు పదేపదే కోరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.