నిజామాబాద్ : తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గత వారం 13 మండలాల బీజేపీ అధ్యక్షులను అర్వింద్ ఏకపక్షంగా మార్చడంపై ఫిర్యాదు చేసేందుకు పలువురు కార్యకర్తలు, మండల నాయకులు హైదరాబాద్ వెళ్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. వారిని సముదాయించేదుకు ఆ పార్టీ నేతలకు తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది.
ఆ వేడి చల్లారక ముందే తాజాగా ఎంపీ అర్వింద్ ఒంటెద్దు పోకడలు నిరసిస్తూ గత వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు.. నేడు పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సేవ్ బీజేపీ పేరిట ఫ్లకార్డులు ప్రదర్శించారు. అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగడంతో అర్వింద్ కు షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీ నాయకుల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.