హైదరాబాద్, డిసెంబర్14(నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) అధికార కాం గ్రెస్ పార్టీకి (Congress Party) అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా (Revanth Reddy) వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు. తొలి, మలి విడత పంచాయతీ పోరులో అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. వేలసంఖ్యలో సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేయగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్చార్జిలుగా గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ చేసినా ఫలితం మాత్రం సర్కార్‌కు చెంపపెట్టుగా మారుతున్నది. బలపరిచిన స్థానాల్లో కాంగ్రెస్ కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా గెలువలేక, గెలిచిన ఆ కొద్దిస్థానాల్లో అతి స్వల్ప మెజార్టీతో చావుతప్పి కన్నులొట్ట మాదిరిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పదిఓట్లలోపు మెజార్టీతో 200పైగా పంచాయతీల్లో గెలిచారంటే పార్టీపై వ్యతిరేకత ఏంటో స్పష్టంగా కనిపిస్తున్నది. లెక్కలు ఇంత స్పష్టంగా ఉన్నా గుంపు మీడియా మాత్రం మసిపూసి మభ్యపెట్టే కథనాలను ప్రసారం చేస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపును పలుచన చేసి, విజయాలను లెక్కల్లో ప్రచారమే చేయకుండా జనం ముందుంచుతున్నది. పంచాయతీల్లో కాంగ్రెస్ ఆధిపత్యమే తప్ప మరేమీ లేదని గోబెల్స్ రాతలు ప్రచారం చేస్తూ ఎల్లోమీడియా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నది.
పెయిడ్ ప్రసారాలతో తికమక
క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి, పొంతనలేని లెక్కల పెయిడ్ ప్రసారాలతో గుంపు మీడియా ప్రజలను తికమక పెడుతున్నది. సీఎంవో నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను ఐదు ప్రధాన మీడియా హౌజ్(ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన) యథాతథంగా ప్రసారం చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. పంచాయతీ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య హోరాహోరి పోరాటం జరిగి, ఫలితాలు కూడా అదేస్థాయిలో ఉన్నా, సదరు మీడియా మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపును తక్కువ చేయడమే కాక, ఆ సంఖ్యను ఇతర లెక్కలో కలిపి గందరగోళం సృష్టిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు రెండేండ్లలో తిరిగి సొంత గూటికి రాగా, పలుకుబడి ఉన్న వారిని ఎన్నికల్లో నిలబెట్టి మద్దతిచ్చి గెలిపించుకుంటే వాటిని కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చూపుతున్నది.
దక్షిణ తెలంగాణలో తిరుగుబాటు
రెండు విడతల్లో కలిపి 811 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. క్షేత్రపోరులో కాంగ్రెస్‌కు నెంబరింగ్ తక్కువగా ఉండడంతో ఏకగ్రీవాలను గంపగుత్తగా కాంగ్రెస్ ఖాతాలో కలిపేసిన ఎల్లోమీడియా ప్రభుత్వానిదే పైచేయి అని తప్పుడు కథనాలను చూపుతున్నది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పల్లెపోరు సమయానికి తిరుగుబాటు పెరిగి ప్రభుత్వ వ్యతిరేకతతో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ఓడిపోతున్నారు. ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే బీఆర్ఎస్ మద్దతుదారులు సంపూర్ణ మెజార్టీతో విజయకేతనం ఎగురవేయడమే అందుకు నిదర్శనం. అలాంటి చోట్ల కూడా సదరు మీడియా ఫలితాలను కాంగ్రెస్‌కు ఆపాదిస్తూ, దానిని బలాన్ని పెంచి చూపే ప్రయత్నం చేస్తున్న తీరు నవ్వుపుట్టిస్తున్నది.