హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ (జేఎల్), గ్రూప్ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం గ్రూప్ 4 అభ్యర్థులు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభన్ను కూడా ముట్టడించారు. ఆయా చోట్ల అభ్యర్థులు తుది ఫలితాల ప్రకటనలో జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
సత్వరమే ఫలితాలను ప్రకటించాలని, దసరా లోపే నియామకాలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ 2022లో జేఎల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, 2023లో పరీక్షలను నిర్వహించి, 2024లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేశారు. తుది ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నది. డీఎస్సీ అభ్యర్థులతోపాటు తమకు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.