హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 783పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 28న గత కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీచేయగా, 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పరీక్షల నిర్వహణకు 33 జిల్లాల్లో 1,368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్-2లో గతంలో 16 రకాల ఉద్యోగాలు ఉండేవి. కొత్తగా ఆరు కేటగిరీల పోస్టులను గ్రూప్-2ద్వారా భర్తీచేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా చేర్చిన క్యాటగిరీలో… అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(రాష్ట్ర ఎన్నికల కమిషన్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టులున్నాయి. వాస్తవానికి గ్రూప్ -2 పరీక్షలు ఆగస్టు 7, 8తేదీల్లో జరగాల్సి ఉండగా, డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అప్పట్లో అభ్యర్థులు రోడ్డెక్కారు. గ్రూప్-2 పోస్టులను సైతం 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు తలొగ్గిన సర్కారు పరీక్షలను వాయిదా వేసింది. ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలోనూ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు.
గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
ఈ నెల 15, 16 తేదీల్లో జరుగనున్న గ్రూప్2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని కోర్టు తిరసరించింది. 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జ్యోతితోపాటు 23 మంది హైకోర్టు లో పిటిషన్ వేశారు. సోమవారం జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. గ్రూప్2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు జరిగినందున మధ్యంతర ఉత్తర్వులు జారీచేయబోమని స్పష్టం చేశారు.