హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హాల్‌టికెట్లు కూడా వచ్చే నెలాఖరులోగా విడుదల చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రకటించిన తేదీనే పరీక్ష నిర్వహణకు వారు మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రశ్నపత్రాల రూపకల్పన, తర్జుమా చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల గుర్తింపు వంటి పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ పరీక్ష వాయిదా వేసే ఉద్దేశమే లేదని తేలిపోయింది. ఇప్పటికే గ్రూప్-1 కోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌పై దృష్టి సారించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోని కోచింగ్ సెంటర్లలో వేలాది మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని స్టడీ సర్కిళ్లలో కూడా శిక్షణ పొందుతున్నారు.
ఎన్నికలకు దూరంగా నిరుద్యోగులు
గ్రూప్-1తోపాటు 2, 3, ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారంలో వారి పాత్ర ఉండకపోవచ్చన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వివిధ పార్టీల తరఫున నిరుద్యోగ యువత ప్రచారంలో పాల్గొనే పరిస్థితులు ఇప్పటికే తగ్గినట్టు భావిస్తున్నారు.