Group-1 Prelims | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆనవాళ్లు.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశ్నలిచ్చారు. తెలంగాణ మలి, తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు. తెలంగాణ అస్తిత్వం లేకుండానే ప్రశ్నపత్రాన్ని రూపొందించడం గమనార్హం. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించింది. గతంలో రెండు సార్లు గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను నిర్వహించగా, తెలంగాణతో మిళితమైన ప్రశ్నలు అనేకం ఇచ్చారు.
రాష్ట్రంలోని ఉద్యోగాలను స్థానికులైన తెలంగాణ బిడ్డలే దక్కించుకోవాలన్న ఆలోచనతో తెలంగాణతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై ప్రశ్నలిచ్చారు. కానీ ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1లో ఒక్క ప్రశ్న కూడా కానరాకపోవడం గమనార్హం. దీంతో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతిపై రెండు ప్రశ్నలిచ్చారు. మహాలక్ష్మిలో భాగమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేయడంపై ఒక ప్రశ్న, గృహజ్యోతిపై మరో ప్రశ్న ఇచ్చారు.
పరీక్షలో భాగంగా తెలంగాణ ఆధునిక చరిత్ర, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పర్యావరణం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలిచ్చారు. ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, రీజనింగ్ ప్రశ్నలను చేధించేందుకు విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. గత రెండు గ్రూప్ -1 పరీక్షలతో పోల్చితే ఆదివారం నిర్వహించిన పరీక్ష కాస్త సులభంగానే ఉన్నట్టుగా నిపుణులు విశ్లేషించారు.
ఇక ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో చాలా మందికి సమయం సరిపోలేదు. సివిల్ సర్వీసెస్ పోటీ శిక్షకుడు బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ గోపాలక్రిష్ణ మాట్లాడుతూ ప్రశ్నల క్లిష్టత సాధారణం నుంచి మధ్యస్తంగా ఉన్నట్టుగా విశ్లేషించారు. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రశ్నపత్రాలను రూపొందించారని, చాలా కాలంగా ప్రిపరేషన్లో ఉన్నవారికి, అవగాహన గల వారికి అనుకూలమని పేర్కొన్నారు.

లక్షకుపైగా అభ్యర్థులు డుమ్మా
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు లక్షకుపైగా అభ్యర్థులు డుమ్మాకొట్టారు. 4.03లక్షల మంది దరఖాస్తు చేయగా, 3.02లక్షల మంది (74శాతం)మాత్రమే పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. 536 పోస్టులుండగా, ఒక్కో పోస్టుకు 536 మంది చొప్పున పోటీపడనున్నారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీని విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ -1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది మెయిన్‌కు క్వాలిఫై అవుతారు.
‘నిమిషం’ నిబంధనతో పరీక్షకు దూరం
నిమిషం నిబంధనతో పలువురు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు దూరమయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల వద్ద రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాంకు చెందిన నవ్యతోపాటు మరో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు.
అలాగే కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వస్తుండగా కూనారం రైలు గేటు పడడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. అధికారులు అనుమతించకపోవడంతో కన్నీటి పర్యంతమవుతూ చేసేదేమీలేక వెనుదిరిగి వెళ్లింది. మరోవైపు మంథనికి చెందిన ప్రసన్య పొరపాటున మరో మిత్రురాలి హాల్‌టికెట్ తీసుకురాగా, ఆమెను కూడా అధికారులు పరీక్షకేంద్రంలోకి అనుమతించలేదు.
ఇన్విజిలేటర్ టైం తప్పు చెప్పాడని
జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళన
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ సెంటర్ ఎదుట గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఆందోళన చేశారు. సెంటర్లోని రూమ్‌నంబర్ 213లో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, ఇన్విజిలేటర్‌ను టైం ఎంతైంది? అని అడిగితే.. చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉందని చెప్పడంతో తొందరగా బబ్లింగ్ చేశామని పరీక్షకు హాజరైన శరత్చంద్ర, మరో 23 మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం 20 నిమిషాలకు పైగా ఖాళీగా కూర్చున్నామని, ఆ తర్వాత అసలు విషయం తెలిసి క్రాస్ చెక్ చేయడంతో తెలిసిన సమాధానాలు కూడా తప్పుగా రాశామని వాపోయారు.
కటాఫ్ 75-80 మధ్య ఉండొచ్చు..
25ప్రశ్నలు లాజికల్ రీజనింగ్, అనలెటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ నుంచి ఇచ్చారు. గణితం నేపథ్యమున్న వారికి ఇది అనుకూలం. పలు సర్వేలు, నివేదికల నుంచి ప్రశ్నలిచ్చారు. బాగా ప్రిపేరైన వారికి లాభించే అంశం. సుదీర్ఘమైన ప్రశ్నలివ్వడంతో చదివేందుకు అభ్యర్థులకు అధిక సమయం పట్టింది. జనరల్ కటాఫ్ 75-80 మార్కుల మధ్య ఉండొచ్చు.
-దీపికారెడ్డి, శిఖర అకాడమీ
తప్పతాగి.. విధులకు
ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం సేవించి ఏకంగా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల డ్యూటీకి వచ్చాడు. అంతేగాక తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు అప్పగించిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. జమ్మికుంట రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మీర్జా పర్వేజ్‌బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీలోని సెంటర్లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్‌గా డ్యూటీ వేశారు. అయితే అప్పటికే మద్యం తాగి సెంటర్‌కు వచ్చిన ఆయన తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
అభ్యర్థులు సెంటర్లోకి వెళ్లగానే బయటకు వచ్చి వైన్స్‌లో బీరు కొనుగోలు చేసి రోడ్డు పక్కన తాగుతుండటంతో పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో ఎస్సైల మీదికే తిరగబడుతూ ఉండగా, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షలో 173 శాతం వచ్చింది. ఐడెంటిఫికేషన్ ఆఫీసర్‌గా అభ్యర్థులు సెంటర్లోకి వెళ్లేవరకే తన డ్యూటీ అని, తన డ్యూటీ అయిపోయాకే బయటకు వచ్చానని, తననెందుకు స్టేషన్‌కు తరలించారని ఎల్ఎండీ ఎస్సై చేరాలు, గన్నేరువరం ఎస్సై నరేశ్‌తోపాటు పోలీసులతో గొడవపడ్డాడు. మధ్యాహ్నం రెవెన్యూ శాఖ ఉద్యోగి, కుటుంబసభ్యులు వచ్చి ఆ ఉద్యోగిని స్టేషన్ నుంచి తీసుకెళ్లారు.