హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియరైంది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో 10-12 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నది. జీవో 29ను సవాలు చేయడంతోపాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపి అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఫలితాల విడుదలకు మార్గం సుగమం చేసింది.