Group 1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగార్థులపై మళ్లీ పోలీసులు తమ ప్రతాపం చూపారు. కనీసం గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆదివారం హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే ఈడ్చుకెళ్లి కర్కశంగా ప్రవర్తించారు. ‘నిరుద్యోగులు భావోద్వేగంలో ఉన్నరు. లాఠీచార్జి చేయొద్దు. కేసులు పెట్టొద్దు. సంయమనం పాటించండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీచేసిన తెల్లారి కూడాఇదే దమననీతిని ప్రదర్శించడం గమనార్హం. ఆదివారం చోటుచేసుకున్న ఈ పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించి తీరుతామని మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నించారు. ఓ ముగ్గురు మీడియాతో మాట్లాడగా, మరొకరు మాట్లాడే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
సీఎం రేవంత్‌కు జీవోలపై కనీస అవగాహన లేదని అభ్యర్థులు ఆరోపించారు. జీవో-29ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అశోక్‌నగర్‌లో గ్రూప్-1అభ్యర్థులు పల్లవి, మహేశ్, జనార్దన్ మీడియాతో మాట్లాడారు. జీవో-29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతున్నదని, జీవో-55 ప్రకారమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జీవో-29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాంపల్లిలోని గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆదివారం గాంధీభవన్ వద్ద ఓయూ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు, అశోక్‌నగర్ చౌరస్తాలో గ్రూప్-1 అభ్యర్థిని అరెస్టు చేస్తున్న పోలీసులు
ఉదయం అశోక్‌నగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడేందుకు అభ్యర్థులు సిద్ధంకాగా, అరెస్టు చేస్తాం.. జైల్లో వేస్తాం.. అన్న హెచ్చరికలతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సర్కారు భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నదని ఉద్యోగార్థులు విమర్శిస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నిస్తున్నారు.