Group-1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో కేంద్రంలో 20 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉంటారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు సైతం తనిఖీలు నిర్వహిస్తారు. జీవో-29పై సోమవార ఉదయమే సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్నది. సుప్రీంతీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. మధ్యాహ్నం నుంచే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తంగా 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.