హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, 31,383 మందికి 21,151 (67.3శాతం) హాజరయ్యారు. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత ముల్యాంకనం చేయించారు. ఇద్దరు మూల్యాంకనం చేయగా, సగటు మార్కులను కేటాయిస్తారు. అయితే మార్కుల్లో 15శాతం తేడాలుంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనం చేయించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియనంతా పూర్తిచేసి ఫిబ్రవరిలో జీఆర్ఎల్ను విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది. గ్రూప్-1తోపాటే గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి ఉంది. తొలుత గ్రూప్-1 ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్-2, గ్రూప్-3లో బ్యాక్ల్యాగ్స్ను నివారించవచ్చన్న ఆలోచనతో ఫిబ్రవరిలో గ్రూప్-1 జీఆర్ఎల్ను విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది. ఈ దిశలో కసరత్తును తీవ్రతరం చేసింది.