సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): గ్రూప్-1 విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, తప్పు చేసిన వారిని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళా కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్ష పెడితే నిరుద్యోగులు ఎంత ఆవేదన చెందుతున్నారో చూశారని పేర్కొన్నారు. ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా? అని ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. పలానా మంత్రులు, పలనా అధికారులు ఇన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారని నేరుగా నిరుద్యోగులే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్‌కు వెళ్తామని చెప్తున్నారని, ఏ ముఖం పెట్టుకొని అప్పీలుకు వెళ్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ రెండేళ్లు పూర్తయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని చెప్పి అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్‌గాంధీని కూర్చోబెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి తామే ఇచ్చినట్టు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి పారిపోయారని, అది జాబ్ క్యాలెండర్ కాదని జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ప్రియాంకగాంధీతో హుస్నాబాద్ సభలో నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పించారని గుర్తుచేశారు. నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు.