Group 1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రూప్-1 అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం నుంచే అశోక్‌నగర్ చౌరస్తాలో ఆందోళనకు సిద్ధమైన అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సమాచారంతో వివిధ జిల్లాల నుంచి వేలాది మంది శనివారం తెల్లారేసరికి అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. తొలుత అందినవారిని అందినట్టే కొడుతూ, చెదరగొట్టే ప్ర యత్నం చేస్తుండటంతో వెల్లువలా తరలిరావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. నిరుద్యోగుల నినాదాలతో అశోక్‌నగర్ పరిసరాలు దద్దరిల్లాయి. ప్లకార్డులతో నిరసన ప్రదర్శనకు దిగారు. ‘జీవో నంబర్ 29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకటించాలి’ అని ముక్తకఠంతో నినదించారు. అశోక్‌నగర్‌లో శాంతియుతంగా జరుగుతున్న తమ ఆందోళనను ప్రధాన మీడియా పట్టించుకోవడం లేదని పలువురు అభ్యర్థులు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నినాదాలతో హోరెత్తిన ట్యాంక్‌బండ్
అశోక్‌నగర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన వేలాదిమంది అభ్యర్థులు ప్లకార్డులు చేతబూని నినాదాలతో హోరెత్తించారు. జీవో 29ను రద్దు చేయాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, జీనా హైతో మర్నా సీకో, సీఎం డౌన్ డౌన్, వియ్ వాంట్ జస్టిస్, ఇదేమీ రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం,‘పోలీసు జులం నశించాలి’ అంటూ దారి పొడవునా నిరుద్యోగులు నినదించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలను వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో చూసిన ఇతర అభ్యర్థులు, నిరుద్యోగులు సైతం తరలివచ్చి ర్యాలీలో చేరిపోయారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆర్టీస్ క్రాస్‌రోడ్ నుంచి, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణ మఠం వరకూ అభ్యర్థుల జనసందోహం కనిపించింది.
గ్రూప్-1 అభ్యర్థులకు ‘బండి’ మద్దతు
మూడు రోజులుగా గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలన్న అభ్యర్థుల ఆందోళనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను తెలుసుకొని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శనివారం ఆందోళనలో పాల్గొన్నారు. సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్తున్న అభ్యర్థులతో కలిసి నడిచారు. ఇందులో ఏబీవీపీ విద్యార్థి సంఘం, బీజేవైఎం నేతలు కలిసి వచ్చారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేవైఎం నేతలు, అభ్యర్థులతో కలిసి కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఏబీవీపీ, బీజేవైఎం నేత లు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలకు వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో బండి సంజయ్‌ని పోలీసులు అక్కడి నుంచి తమ వాహనంలోకి ఎక్కించుకొని నాంపల్లిలోని బీజేపీ కార్యాయానికి తరలించారు. బండి సంజయ్‌ని పోలీసు వాహనంలోకి ఎక్కించే క్రమం లో.. ఆయనే ‘నన్ను లోపలికి గుంజు.. లోపలికి గుంజు’ అని ఓ కానిస్టేబుల్‌కు చెప్పడంతో.. అతను బండి సంజయ్‌ని వాహనం లోపలికి నెట్టారు. ‘లోపలికి గుంజు’ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
సచివాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు
వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. ప్రధాన ద్వారం వద్ద కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల దమననీతిని ప్రశ్నిస్తూనూ సాక్షాత్తూ సచివాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈసారి రిజర్వేషన్ల కింద ఉద్యోగం రాకపోతే.. చావే దిక్కంటూ.. పలువురు బోరున విలపించారు. అశోక్‌నగర్ ఆందోళనలను వరుసగా ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో పోస్టుచేసిన వారి అకౌంట్లను బ్లాక్ చేయించారు.
ఆందోళనను పక్కదారి పట్టించేందుకు బీజేపీ కుట్ర
బీజేపీ మహిళా నాయకులను ముందు పెట్టి.. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలను ఏమీ అనొద్దని, ఇది మంచి పద్ధతి కాదని, ఆందోళన పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తించొద్దని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు బీజేపీ నేతలకు చేతులెత్తి దండం పెట్టి, కాళ్లు మొక్కి కోరారు. అయినా అవేం పట్టించుకోకుండా ‘బీఆర్ఎస్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వారి దాడి ప్రయత్నాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా బీజేపీ మహిళా కార్యకర్తలు దౌర్జన్యం ప్రదర్శించారు. దీంతో గ్రూప్-1 అభ్యర్థులు బీజేపీ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నేతల అరెస్టురూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులకు అండగా.. ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యర్థుల ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్, ముఠా జైసింహా, గజ్జల నగేశ్, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు. అశోక్‌నగర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ విద్యార్థులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. తక్షణం జీవో 29ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆ నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ను పునరుద్ధరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలి. అంతవరకూ గ్రూప్-1ను వాయిదా వేయాలని కోరారు.
నిరుద్యోగుల డిమాండ్లు ఇవే..