కరీంనగర్ కలెక్టరేట్, మే 06: వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది. జిల్లా పరిధిలోని చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు ఆవిరైపోతుండగా, వాటిలోని అవశేషాలు వెక్కిరిస్తున్నాయి. ఉక్కపోత, భరించలేని వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూడా నీటిని అదే స్థాయిలో వినియోగిస్తున్నారు. ఈ ప్రభావం భూగర్భ జలాలపై (Ground Water) పడుతోంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. తమ స్థిరాస్తులు, ఆభరణాలు తనాఖా పెడుతూ, అట్టడుగుకు చేరిన నీటిని పైకి తెచ్చేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిమట్టంపై జిల్లా భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చిలో 8.10 మీటర్లు, ఏప్రిల్ లో 9.02 మీటర్ల సగటు నీటిమట్టం నమోదైంది. గత ఏడాది వేసవిలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టంలో మార్పు వచ్చి, కొంతమేర ఉపశమనం కలిగింది. అనంతరం అసలు రెయినీ సీజన్లోనే వర్షాలు ముఖం చాటేయగా, ఎప్పటికప్పుడు భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా వాటితో భూగర్భజలాలు పెరగలేదని భూగర్భ జల వనరుల శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని 12 మండలాల్లో మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ మాసంలో మరింత లోతుకు వెళ్లాయి. ప్రధానంగా ఇల్లందకుంట మండలంలో 2.84 మీటర్ల లోతుకు చేరాయి. కరీంనగర్ అర్బన్ లో2.22, చొప్పదండిలో 2.17, గంగాధర లో 1.31 మీటర్ల లోతుకు చేరాయి. చిగురుమామిడి, గన్నేరువరం, రామడుగు, వీణవంక మండలాల్లో మాత్రం పెద్దగా మార్పులేదు. మార్చి నెలతో పోల్చితే ఏప్రిల్లోలో వ్యవసాయ పనులకు నీటివినియోగం తగ్గినా, జలాలు మరింత అడుగుకు చేరటం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా ఆయకట్టు ప్రాంతాల్లోనే భూగర్భజరాలు లోతుకు వెళ్లటం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ ముందు చూపులేమితోనే వాటర్ హబ్‌గా పేరుగాంచిన జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో, గోదావరి నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్టుల నుంచి వేసవికి ముందే జిల్లాలోని జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయడంతో, భూగర్భ జలాలు భూ ఉపరితలానికి సమాంతరంగా ఉండేవని, తద్వారా మండుటెండల్లో సైతం జలకలను సంతరించుకొని జిల్లా భూములు కోనసీమను మైమరిపించేవని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నీటి వనరులపై కనబరుస్తున్న నిర్లక్ష్యంతో భూగర్భ జలాలు అడుగంటుతూ, త్రాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముందుచూపు కొరవడటంతోనే ఈ దుస్థితి తలెత్తుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.