హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఒకో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టంచేశారు.
ఈ నెల 23 వరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా 95 నియోజకవర్గాలకుగాను 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ఇండ్ల మంజూరులో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల జిల్లాల పనితీరు మెరుగుపడాల్సి ఉన్నదని తెలిపారు. ఇంటి స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు కేటాయించని 2 బీహెచ్‌కే ఇండ్లను కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. 2 బీహెచ్‌కే ఇండ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తామని, అందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని అందించనున్నట్టు స్పష్టంచేశారు.