హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి గ్రోక్ ఏఐ మేకులా మారిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ 11 ఏండ్లుగా చెప్తున్న వాటిలో నిజమెంతుందో అది తేటతెల్లం చేస్తున్నదని తెలిపారు. టెక్నాలజీని వాడుకొని, అబద్ధాలనే నిజాలుగా నమ్మిస్తూ, వాట్సప్ ద్వారా దేశంలో విద్వేషాన్ని నింపిన బీజేపికి, ప్రధాని మోదీకి గ్రోక్ చుక్కలు చూపిస్తున్నదని దుయ్యబట్టారు.
వాస్తవాలేంటో ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నదని తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై వాట్సప్ యూనివర్సిటీ వెదజల్లిన అసత్యాలను కూడా గ్రోక్ పటాపంచలు చేసి, ఆయన గొప్పదనాన్ని చాటి చెప్పిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో బెస్ట్ ఎవరని అడిగితే కేసీఆరేనని గ్రోక్ స్పష్టం చేసిందని తెలిపారు. బీజేపీని, మోదీని గోకి గోకి.. ఏకిపారేస్తుందని తెలిపారు. బీజేపీని, మోదీని ఎదుర్కోవడంలో రాహుల్ అట్టర్‌ఫ్లాప్ అయ్యారని పేర్కొన్నారు. మోదీకి ఒక ప్రచార వస్తువుగా మారిపోయారని ఎద్దేవా చేసింది. ఈ దశలో గ్రోక్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు.