హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక శాఖ ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 డివిజన్ల ఎన్నికకు ఎస్ఈసీ జనవరి 27న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఆయా నగరాల, పట్టణాల ప్రజలు ఎన్నికల నిర్వహణపై సమస్యలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు పురపాలక శాఖ హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటుచేసింది.
గత తొమ్మిది రోజుల్లో 22 ఫిర్యాదులు వచ్చినట్టు ఆ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేదని, తమ డివిజన్లో అత్యధిక ఓటర్లు ఉన్నారని, తమ డివిజన్‌ను మరో క్యాటగిరీకి కేటాయించాలని ఇలా.. వివిధ అంశాలపై ప్రజలు, వివిధ సంఘాల నేతలు ఫిర్యాదులు చేసినట్టు పేర్కొన్నారు. ఆయా ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు నేరుగా కార్యాలయానికి వచ్చి ఇవ్వాలని, ఫోన్లో ఫిర్యాదు చేసే సౌలభ్యం లేదని ఆమె తెలిపారు.