Greenfield Highway | రంగారెడ్డి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీ కోసం వేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ బాధితులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన సుమారు పది మంది రైతులు పెట్రోల్ బాటిళ్లతో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని చెప్పినా ప్రధానగేటు వద్దే పోలీసులు వారిని అడ్డుకోవటంతో కాళ్లావేళ్లాపడి బతిలాడారు. అయినా కనికరించకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చావనైనా చస్తాం గాని గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పేట్ నుంచి వేసే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం ఓఆర్ఆర్ నుంచి కొంగరకలాన్, రావిర్యాల తదితర గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. మహేశ్వరం మండలం రావిర్యాల, కొంగరకుర్ధు గ్రామాల పరిధిలోని 13 సర్వే నంబర్లో రైతులు కాసుల బాలరాజుకు చెందిన రెండెకరాల 17 గుంటలు, కాసుల సుధాకర్‌కు చెందిన ఎకరం 32 గుంటలు, జీ రమాదేవికి చెందిన 20 గుంటలు, కుడుముల రవీందర్‌కు చెందిన ఎకరం 20 గుంటలు, గున్నాల నర్సింహకు చెందిన మూడెకరాల 20 గుంటల పట్టా భూముల్లోంచి 300 ఫీట్ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా రైతులు ఆ భూముల్లో వరి, పూలతోటలు, కూరగాయల సాగుతో జీవనం సాగిస్తున్నారు. తమకు ఆధారమైన భూముల్లో రోడ్డువేసే తమ బతుకులు రోడ్డున పడుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ సర్వే పనులను అడ్డుకున్నారు. కాగా పోలీసుల సాయంతో రెవెన్యూ, సర్వే అధికారులు సోమవారం హద్దురాళ్లు పాతేందుకు వచ్చారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పరిహారం ప్రకటించకుండా హద్దురాళ్లు ఎలా పాతుతారని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల పహారా నడుమ అధికారులు హద్దురాళ్లను పాతుతూ రైతులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో రైతులు ఆవేదనతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రజావాణిలో అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చేసేది లేక పదిమంది రైతుల్లో బాలరాజు అనే రైతు పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
కావాలనుకుంటే ప్రాణాలు వదులుతాం తప్ప భూములను వదులుకోం. మా అన్నదమ్ములిద్దరికి చెరో రెండెకరాల పొలం ఉన్నది. దానిపైనే ఆధారపడి బతుకుతున్నం. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం మా భూములను ప్రభుత్వం గుంజుకుంటున్నది. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పరిహారం కూడా ఇవ్వకుండానే స్వాధీనం చేసుకుంటున్నరు. మా భూములకు బదులు వేరేచోట భూమి ఇవ్వాలని కోరినం. లేదంటే మార్కెట్ రేటైనా ఇవ్వాలని కోరినం. అయినా మా మొర వినిపించుకుంటలేరు. మా పట్టా భూములను గుంజుకోవటానికి ముఖ్యమంత్రి ఎవరు? పరిహారం ఇవ్వకుండా ఎలాంటి పనులు చేయడానికి వచ్చినా మేమంతా మా కుటుంబాలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటం.