హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నది. తెలంగాణపై మాత్రం అడుగడుగునా అంతులేని వివక్షను ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న ఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియకముందే మరో రూ.లక్ష కోట్ల పనులు ప్రారంభిస్తామని, వచ్చే రెండేండ్లలో ఏపీలోని రోడ్లను అమెరికా రోడ్ల మాదిరిగా తీర్చిదిద్దుతామని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. శనివారం ఆయన ఏపీలోని మంగళగిరికి విచ్చేసి పలు జాతీయ రహదారులను ప్రారంభించడంతోపాటు కొత్తగా మరికొన్ని రహదారులకు శంకుస్థాపన చేశారు. కానీ, తెలంగాణలో అధ్వానంగా తయారైన జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టుకు నరేంద్రమోదీ సర్కారు అనుమతులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం ఏపీలో 8,700 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా.. తెలంగాణలో 4,983 కి.మీ. జాతీయ రహదారులు మాత్రమే ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రస్తుతమున్న రహదారిని 6 లేన్లకు విస్తరించే పనులు కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది.
ఈ పనులు కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. కానీ, తెలంగాణకు ఎప్పుడో మంజూరైన ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఇంకా అనుమతులు ఇవ్వలేదు. నాలుగు లేన్ల రహదారిని ఆరులేన్లుగా నిర్మించాలని నిర్ణయించినప్పటికీ అందుకు సంబంధించిన ప్రక్రియను ఇంకా మొదలు పెట్టలేదు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కర్నూలు సరిహద్దుల వరకు ఉన్న అటవీ ప్రాంతంలో సుమారు 60 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించినప్పటికీ అందులో ఇంతవరకు పురోగతి లేదు. తెలంగాణలో 1,600 కి.మీ. మేర ఉన్న 16 ప్రధాన రాష్ట్ర రహదారులను అప్‌గ్రేడ్ చేయాలని ఏన్నో ఏండ్ల నుంచి కోరుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతుతో మనుగడ సాగిస్తున్నందునే ఏపీకి భారీగా ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి. అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్రం ఏపీకి పెద్దపీట వేయడం, తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించడం సరికాదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.